– వరద సాయం చేయట్లే.. : బీఆర్‌ఎస్ నేతల విమర్శ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వరద ప్రభావిత ప్రజలకు సహాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్ నేతలు విమర్శించారు. ఆదివారంనాడిక్కడి తెలంగాణ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ రెడ్డి మాట్లాడారు. వరదల్ని ఎదుర్కొవడంలో ప్రభుత్వం వద్ద ప్రణాళికే లేదన్నారు. కేవలం ప్రతిపక్షాల్ని, కేసీఆర్‌ను తిట్టడానికే మంత్రులు పరిమితమయ్యారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారనీ, ముఖ్యమంత్రి పదవి గౌరవాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారని విమర్శించారు. భారీ వర్షాలతో గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారనీ, విషజ్వరాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో వర్షాలు, వరదలపై సీఎం, మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో చెరువులను ఆక్రమించింది కాంగ్రెస్ నాయకులే అని ఆరోపించారు. హైడ్రా అట్టర్‌ప్లాప్ అయ్యిందనీ, దానికి చట్టబద్ధత లేదన్నారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై మాట్లాడితే రేవంత్‌రెడ్డికి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిందని గుర్తుచేశారు.