– వెంకట్రామిరెడ్డి గెలుపు.. మెదక్ అభివద్ధికి మలుపు
– ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
నవతెలంగాణ-ఐడీఏబొల్లారం, జిన్నారం
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా వైఫల్యం చెందిందని.. పార్లమెంటు ఎన్నికల్లో గెలిపిస్తేనే హామీలు అమలవుతాయని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం మరోసారి ప్రజలను మోసగించేందుకేనని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గడ్డపోతారం గ్రామంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో శనివారం ఏర్పాటుచేసిన జిన్నారం, గుమ్మడిదల, బొల్లారం మెదక్ పార్లమెంట్ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణుల కు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లపా టు ప్రతి గ్రామం అభివద్ధి పథంలో ముందుకు సాగిందన్నారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడంతో పాటు సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. ఢిల్లీకి గులాం గిరి చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయం అత్యంత ఆవశ్యమన్నారు. సమర్థుడు, పరిపాలన ధక్షుడు, ఉమ్మడి జిల్లా పై సమగ్ర అవగాహన కలిగిన వెంకటరామిరెడ్డిని గెలిపిస్తే మెదక్ అభివద్ధికి నిరంతరం పాటు పడతారన్నారు. పదేళ్ల కాలంలో ప్రతిపక్ష పార్టీలను ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టలేదని.. ఇందుకు పూర్తి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ గత ఐదు నెలల్లో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగడంతో పాటు అక్రమంగా కేసులు నమోదు చేస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అధికారం ఎవరికి శాశ్వతం కాదని.. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలని సూచించారు. కార్యకర్తలే వెన్నుముకగా పనిచేస్తున్న బీఆర్‌ఎస్.. ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తుందని తెలిపారు. రాబోయే 13 రోజుల పాటు బూత్ స్థాయి నుండి ప్రచారం వేగవంతంగా జరగాలని కోరారు. అనంతరం బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్య కమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, గుమ్మడిదల జెడ్పీటీసీ కుమార్ గౌడ్, మాజీ జడ్పీటీసీ కొలను బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, పార్టీ అధ్యక్షులు రాజేష్, హనుమంత్ రెడ్డి, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.