నవతెలంగాణ-దమ్మపేట
ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం చెందిందని సిపిఐ ఎంఎల్ మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అమర్లపూడి రాము పేర్కొన్నారు. మండలంలోని లింగాలపల్లి గ్రామంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వ వైఫల్యంకు సంబంధించి డిమాండ్స్‌తో కూడిన కర పత్రాన్ని బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతాంగ రుణాలు రద్దుచేయడంతో పాటు వారికి కొత్త రుణాలు ఇవ్వాలని, పంటల బీమా పథకం జూలై ఆగస్ట్ నెలలో అమలు చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని, వాస్తవ సాగుదారులందరికీ రైతు భరోసా అందించాలని కోరారు. ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 22న మండల కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహించాలని అదేవిధంగా ఈనెల 29న కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలను ప్రజలు పార్టీ శ్రేణులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకురాలు తొడం దుర్గమ్మ, పార్టీ మండల కార్యదర్శి కురసం ముత్యాలరావు, మండల నాయకులు బండి ఆదినారాయణ, వెంకటేష్, రాముడు, కుంజా కాంతారావు, కాకా రమేష్, కొండ్రు లక్ష్మి, వాడ గిరి, సున్నం పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.