– ఉదరుపూర్ డిక్లరేషన్‌కు అనుగుణంగా ఎంపిక : కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మెన్ మురళిధరన్
– రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లా కేసీఆర్ కుటుంబం
– విద్యార్థుల ఆత్మహత్యలు…ప్రభుత్వ హత్యలే : పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 58 మందితో కూడిన అభ్యర్థుల మొదటి జాబితా ఆదివారం విడుదల చేయనున్నట్టు టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మెన్ మురళీధరన్ వెల్లడించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఇతర రాష్ట్రాలతో కలిపి తెలంగాణ మొదటి జాబితాను విడుదలచేస్తున్నట్టు చెప్పారు. మరో రెండు రోజుల్లో మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ.వేణుగోపాల్ నివాసంలో రాష్ట్ర నేతలు శనివారం భేటీ అయ్యారు. స్క్రీనింగ్ కమిటీ చైర్మెన్ మురళీధరన్, రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, తెలంగాణలో రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీల పర్యటన, ప్రచార ఏర్పాట్లు ఇతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ గెలుపు గుర్రాలు, పార్టీ విధేయతను ప్రధానంగా పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపికచేసినట్టు తెలిపారు. ఉదరుపూర్ డిక్లరేషన్‌కు అనుగుణంగా అన్ని మతాలు, కులాల వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. వామపక్ష పార్టీలతో పొత్తు చివరి దశలో ఉందనీ, దీనిపై కూడా ఆదివారం మరింత స్పష్టత వస్తుందని వెల్లడించారు.
వామపక్షాలతో పొత్తుపై
మీడియాకు వెల్లడిస్తాం : రేవంత్
వామపక్ష పార్టీలతో పొత్తులపై పార్టీలో కొంత స్పష్టత వచ్చిందని రేవంత్ అన్నారు. ఆ నిర్ణయాలను సీపీఎం, సీపీఐ నేతలతో పంచుకున్నాక మీడియాకు వెల్లడిస్తామన్నారు. రాహుల్, ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన వివరాలను ఆదివారం మధ్యాహ్నం వెల్లడించనున్నట్టు తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే విద్యార్థుల జీవితాలతో సీఎం కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్స్ పరీక్షలు నిర్వహించలేకపోయారనీ, 12వ తరగతి పేపర్లను దిద్దలేకపోయారని విమర్శించారు. ఆనాడు గ్లోబరిన్ సంస్థ కారణంగా 30 మంది ఇంటర్ విద్యార్థులు బలితీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల రద్దు, ప్రశ్నాపత్రాలు లీక్ చేయడం, పరీక్షలు వాయిదా వేయడం తదితర కారణాలతో అభ్యర్థులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. తల్లిదండ్రులకు ఆమె రాసిన లేఖ హృదయం వున్న ఎవరినైనా కన్నీళ్లు పెట్టిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ మాత్రం పార్టీ ఫిరాయింపులు, బీఫారాలు, టికెట్లు, వసూళ్లు, ప్రచారంపై దృష్టి సారించారని విమర్శించారు. విద్యార్థుల హత్యలు, ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనన్నారు. తెలంగాణ విద్యార్థులు, యువకులకు ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తిచేశారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ప్రజాసర్కార్ కొలువుదీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఆరు గ్యారెంటీలపై తొలి సంతకాలు చేయనున్నట్టు చెప్పారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఆత్మహత్య చేసుకున్న అమ్మాయిపై విచారణ పేరుతో అభాండాలు వేయడం సీఎం కేసీఆర్ నీచమైన తీరుకు నిదర్శనమన్నారు. ఆమె మరణంపై 24 గంటల్లో విచారణ పూర్తి చేసిన అధికారులు, ప్రశ్నా పత్రాల లీక్‌పై విచారణ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్, ఆయన కుటుంబం రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వెంచర్లు వేసే వారు ఒక మోడల్ హౌస్ కట్టి ప్లాట్లు అమ్మినట్టు, త్రిడీ షోలు తయారుచేసి వాటిని చూపించి అడ్వాన్స్‌లు తీసుకున్నట్టు రాష్ట్ర సర్కార్ తయారైందని ఆరోపించారు. డబుల్ బెడ్ రూం, ఇతర వ్యవహారాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు.
రాహుల్‌తో తుమ్మల భేటీ
పార్టీ అధిష్టానం ఎక్కడ అవకాశం కల్పిస్తే అక్కడి నుంచి సామాన్య కార్యకర్తలా బరిలో దిగుతానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. కేంద్ర నాయకత్వం పిలుపు మేరకు శనివారం ఢిల్లీ వచ్చిన ఆయన…పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ.వేణుగోపాల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కష్టపడి పని చేయాలని రాహుల్ సూచించారని చెప్పారు. పార్టీ గెలుపు కోసం తన సాయశక్తుల కృషి చేస్తానని అధిష్టానానికి మాట ఇచ్చినట్టు తుమ్మల వెల్లడించారు.