రాష్ట్రంలో ఎగిరేది కాంగ్రెస్‌ జెండానే..

– రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తాం
– రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణం :
మహబూబాబాద్‌ పార్లమెంట్‌ పరిశీలకులు పరమేశ్వర్‌నాయక్‌, ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ-ములుగు
రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఎగిరేది కాంగ్రెస్‌ జెండానేనని, తాము అధికారంలోకి రాగానే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్‌ సౌకర్యం కల్పిస్తామని మహబూబాబాద్‌ పార్లమెంట్‌ పరిశీలకులు, కర్ణాటక మాజీ మంత్రి పరమేశ్వర్‌నాయక్‌, ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ములుగులో ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా సమన్వయ సమావేవంలో వారు మాట్లాడారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ పాలన కొనసాగిస్తూ నియంతృత్వ పోకడలతో ప్రజలను నట్టేట ముంచుతున్నారని అన్నారు. తెలంగాణ వస్తే బతుకులు మారుతాయి, మన బాధలు తీరుతాయని నమ్మిన ప్రజలను మోసం చేశారని, నియంతపాలన సాగిస్తూ మాయమాటలతో కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి, దళితబంధు, రుణమాఫీ, ఉచిత కరెంటు ఇస్తామన్న హామీని ఎక్కడా అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి రూ.4 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేస్తామని, ప్రతి పేదవాడికీ ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఇస్తామని చెప్పారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం పని చేస్తుందని, కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రవళిరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్‌, ఎల్‌డీఎంఅర్సీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ అనీల్‌, మర్కా విజరు కుమార్‌, కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్‌ గౌడ్‌, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు బానోత్‌ రవిచందర్‌, ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, ప్రచార కమిటీ చైర్మెన్‌ పూజారి సురేందర్‌ బాబు, మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షులు అయిబ్‌ఖాన్‌, ఫిషర్‌మెన్‌ జిల్లా అధ్యక్షులు కంబాల రవి, లీగల్‌సెల్‌, సమాచార హక్కు జిల్లా అధ్యక్షులు జగన్మోహన్‌ రెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు బైరెడ్డి భగవాన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.