– ఈ స్థాయికి ఎదగడానికి మల్కాజిగిరి ప్రజలే కారణం
– ఎంపీ సీటే కాదు కంటోన్మెంట్‌లోనూ గెలవాలి
– రాష్ట్రమంతా అనుసరించేలా ప్రచారముండాలి
– పనిచేసేటోళ్లకు పార్టీలో, ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తాం : మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తాను సీఎం స్థాయికి ఎదగడానికి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలే కారణమనీ, అలాంటి చోట ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేసేలా ప్రణాళికతో పనిచేయాలని ఆ పార్టీ నాయకులకు టీపీసీసీ అధ్యక్షులు, సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. హోలీ పండగలోగా అధిష్టానం మిగతా ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తుందని తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. అందులో సీఎంతో పాటు మధుయాష్కీ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, పట్నం సునీత రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు నర్సింహారెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు సీఎం సమక్షంలో మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు మంత్రి సీతక్క కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సన్నాహక సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో 2,964 బూత్‌లలో కార్యకర్తలు సైనికుల్లా పనిచేశారన్నారు. మల్కాజిగిరి కార్యకర్తలు తనను భుజా లపై మోసి ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించారని గుర్తుచేసుకున్నారు. తన బలం, బలగం పార్టీ శ్రేణులే అని నొక్కి చెప్పారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి నాయకునికీ, కార్యకర్తకూ గుర్తింపు ఉంటుందనీ, పారీ, ప్రభుత్వంలో వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత తనదని హామీనిచ్చారు. రాష్ట్రమంతా తుఫాను వచ్చినట్టు కాంగ్రెస్ గెలిచినా మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఆశించిన ఫలితా లు రాలేదన్నారు. అందుకే ఈసారి కచ్చితంగా ఆ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలనీ, అప్పుడే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. కంటోన్మెంట్‌లోనూ పార్టీ అభ్యర్థిని గెలించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఆ పార్లమెంట్ స్థానంలో చేసే ప్రచారం రాష్ట్రమంతటా ఆనుసరించేలా ఉండాలని నొక్కి చెప్పారు. ప్రతిరోజూ ఉదయం ఏడుగంటలకే నా యకులు బస్తీ బాట పట్టాలన్నారు. బలమైన నాయకత్వం ఉందనీ, సమన్వయంతో ముందుకెళ్లాలని కోరారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేసిన అభ్యర్థులు, మరో ఐదుగురు సభ్యులతో కమిటీ వేసుకోవాలనీ, పోలింగ్ బూతుల వారీగా పనివిభజన చేసుకుని ముందుకెళ్లాలని సూచించారు. శుక్రవారం సాయం త్రం కంటోన్మెంట్‌లో కార్యకర్తల సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. 2019 మల్కాజిగిరి పార్లమెంట్‌లో తాను గెలవటం నుంచే కేసీఆర్ పతనం ప్రారంభ మైందన్నారు. వందరోజులు పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10లక్షలకు పెంపు, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేసుకుంటున్నామని వివరించారు. మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదని చెప్పారు. కేంద్రంతో సఖ్యతతో ఉండి మల్కాజిగిరిలో స్కైవేల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామని గుర్తుచేశారు. మల్కాజిగిరికి మెట్రో, ఎంఎంటీఎస్ రావాలన్నా.. జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్య తీరాలన్నా కాంగ్రెస్ ను గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.