గ్రేటర్‌పై కాంగ్రెస్‌ ఫోకస్‌!

Congress focus on greater!– 24 అసెంబ్లీ సెగ్మెంట్‌లలో గెలుపే లక్ష్యం
–  బీఆర్‌ఎస్‌, ఎంఐఎంను ఏకకాలంలో ఎదుర్కొనేలా వ్యూహరచన
– సికింద్రాబాద్‌ బరిలో వైఎస్‌ షర్మిలను దింపే యోచనలో అధిష్టానం?
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్‌ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పూర్వవైభవం దిశగా పావులు కదుపుతోంది. వైఎస్‌ షర్మిలను నగరంలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయించి.. తద్వారా గ్రేటర్‌లో పార్టీ బలోపేతంతో పాటు రానున్న ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేలా వ్యూహ రచన చేస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మొత్తం 29 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. ఇందులో హైదరాబాద్‌లోనే 15 అసెంబ్లీ స్థానాలుండగా.. మేడ్చల్‌లో 5, రంగారెడ్డిలోని తొమ్మిదింటిలో రాజేంద్రనగర్‌, ఎల్బీనగర్‌, శేరిలింగంపల్లి, మహేశ్వరం స్థానాలున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 2004, 2009లో కాంగ్రెస్‌ పార్టీ హవా కొనసాగింది.. 2014లో బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ బలహీనపడింది. అయితే నాయకులు వెళ్లిపోతున్నా.. క్యాడర్‌ మాత్రం పార్టీని అట్టిపెట్టుకొనే ఉన్నారు. వారే ఇప్పుడు ఆ పార్టీకి బలం, బలగంగా మారారు. అగ్రనేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర, కర్నాటకలో పార్టీ గెలుపుతో మళ్లీ తెలంగాణతో పాటు గ్రేటర్‌లో కాంగ్రెస్‌కు పునర్‌ వైభవం దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ పుంజుకుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నాంపల్లి, ముషీరాబాద్‌, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, ఎల్బీనగర్‌, మహేశ్వరం నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌కు దీటుగా కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థులున్నారు. అదే సమయంలో గోషామహల్‌, అంబర్‌పేట్‌, రాజేంద్రనగర్‌, ఉప్పల్‌, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టంగా ఉన్నా.. టికెట్‌ కోసం ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారు. ఇక ఎంఐఎం బలంగా ఉన్న ఏడు నియోజకవర్గాల్లోనే బలమైన అభ్యర్థులు కరువయ్యారు. ప్రతి ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థుల గెలుపులో కీలకంగా ఉన్న మైనార్టీల ఓట్లు ఈసారి కాంగ్రెస్‌ వైపునకు మళ్లే అవకాశమున్నా.. వారిని ఆకర్షించడానికి గట్టి నాయకత్వం లేదు. ఈ మధ్యకాలంలో ఆ పార్టీ ప్రకటిస్తున్న డిక్లరేషన్స్‌ ప్రజల్లోకి తీసుకుపోయి పార్టీని విజయతీరాలకు చేర్చే నాయకుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. దీన్నుంచి బయటపడేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం వైఎస్‌ షర్మిల వైపు చూస్తోంది. వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకుని.. ఆమెకు గ్రేటర్‌ ఎన్నికలు బాధ్యతలు అప్పగించే అవకాశముందని తెలుస్తోంది. అదేవిధంగా షర్మిలను సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేయించడంతో పాటు పార్టీ అభ్యర్థులను గెలిపించే బరువు బాధ్యత కూడా ఆమెపై పెట్టనున్నారు.
అన్ని కలిసొస్తే.. ఆమె గెలుపు ఖాయం!
వైస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో (2009 ఎన్నికల్లో) సికింద్రాబాద్‌ అసెంబ్లీ స్థానం నుంచి సినీనటి జయసుధ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక్కడ ఇప్పటికీ వైఎస్‌ అభిమానులు, కార్యకర్తలతో పాటు ఓ గ్రూపు ఓట్లు కీలకంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి వైఎస్‌ షర్మిలను బరిలోకి దింపితే సునాయాసంగా గెలిచే అవకాశం ఉందని ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. అంతేగాక ఆమె సేవలను పాతబస్తీతో పాటు ఇతర అసెంబ్లీ స్థానాల్లోని అభ్యర్థుల గెలుపు కోసం ఉపయోగించుకోవచ్చని అంటున్నారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌ కూడా అదే ఆలోచనలో ఉన్నట్టు పార్టీ నాయకులు ద్వారా తెలుస్తోంది.