సామాజిక సమీకరణాలపై కాంగ్రెస్‌ ఫోకస్‌

– బీసీలకు ఎన్నికల్లో ప్రాధాన్యత మాదిగ సామాజికవర్గంపైనా కేంద్రీకరణ కారును ఢ కొట్టేందుకు పక్కా వ్యూహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఎన్నికల్లో పోటీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించిన కాంగ్రెస్‌ పార్టీ…సామాజిక సమీకరణాలపై ఫోకస్‌ పెట్టింది. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. అధికార పార్టీ బీసీలకు అన్యాయం చేసిందనే విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఆ సామాజికవర్గంపై దృష్టి సారించింది. అందులోనూ బీఆర్‌ఎస్‌ ముదిరాజ్‌ సామాజికవర్గానికి ఒక సీటు కూడా ఇవ్వలేదు. ఈసారి ఆ వర్గాలకు కాంగ్రెస్‌ పెద్ద పీట వేసేలా ప్రణాళికలు రచిస్తోంది. బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రాధాన్యత ఇవ్వని ముదిరాజ్‌, కురుమ లాంటి సామాజిక వర్గాలతో పాటు, గౌడ, మున్నూరు కాపు సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేలా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో గెలుపోటములను ప్రభావితం చేయడంలో ముదిరాజ్‌ సామాజిక వర్గం పాత్ర కీలకం. ఇటీవల బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ముదిరాజ్‌ సామాజిక వర్గానికి బీఆర్‌ఎస్‌ పార్టీ మొండిచేయి చూపింది.ఆ సామాజిక వర్గానికి మంత్రి పదవులు ఇవ్వకుండా బీఆర్‌ఎస్‌ అన్యాయం చేసిందంటూ శుక్రవారం గాంధీభవన్‌లో ఎంపీ ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కురుమ సామాజికవర్గం నుంచి ఉమ్మడి నల్లొండ జిల్లా, ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ నుంచి ఒక్కోనేత ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న మాదిగ సామాజిక వర్గంపై సైతం కాంగ్రెస్‌ పార్టీ నజర్‌ పెట్టింది. ఇటీవల మాజీ మంత్రి, మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఏ చంద్రశేఖర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అదే సామాజిక వర్గానికి చెందిన నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, బీఆర్‌ఎస్‌ నేత మందుల సామేలు బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు టికెట్‌ దక్కకపోవడంతో అసంతృప్తిని వ్యక్తం చేసి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ సామాజిక వర్గానికి రాష్ట్ర క్యాబినెట్‌లో కూడా బీఆర్‌ఎస్‌ చోటివ్వలేదని కాంగ్రెస్‌ మొదటి నుంచే విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వర్గానికి కూడా తగిన ప్రాధాన్యత కోసం కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది.బీసీల్లో గౌడ, మున్నూరుకాపు, పద్మశాలి
సామాజిక వర్గాలకు సైతం వీలైనంత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. బీఆర్‌ఎస్‌లో ముదిరాజ్‌, మాదిగ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత లభించకపోవడంపై టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి లాంటి కీలక కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికే పలుమార్లు విమర్శలు చేశారు. ఇప్పుడు ఇదే అంశాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.
పోటెత్తిన దరఖాస్తులు
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్లు ఆశించే వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. దరఖాస్తులకు ఇవాళ చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున ఆశావహులు గాంధీభవన్‌కి వచ్చారు. 723 దరఖాస్తులు రాగా.. శుక్ర వారం అవి 1000కి దాటాయి. ఇల్లెందుల నుంచి అత్యధికంగా 38 మంది దర ఖాస్తు చేసుకున్నారు. కాగా కొందరు నేతలు ఒకటి కంటే ఎక్కువ స్థానాలకు దరఖాస్తు చేసుకుంటున్న దోరణి కూడా ఉన్నది. ఆశావాహులు పెద్ద ఎత్తున దర ఖాస్తు చేసుకున్నారు. ప్రతి నియోజకవర్గానికి సగటున 8-9 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అంతేకాకుండా టికెట్ల కోసం ఒకే నియోజకవర్గంలో ఒకే కుటుంబం నుంచి వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఉన్నారు.
తప్పుకున్న జానారెడ్డి
ఎన్నికల పర్వం నుంచి మాజీ ప్రతిపక్ష నేత కె జానారెడ్డి తప్పుకున్నారు. ఆయన ఇద్దరు కుమారులతో దరఖాస్తు చేయించారు. నాగార్జునసాగర్‌ టిక్కెట్‌ కోసం జైవీర్‌రెడ్డి, మిర్యాలగూడ టికెట్‌ కోసం రఘువీర్‌ రెడ్డి దరఖాస్తు చేశారు. అంధోల్‌ నుంచి మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఆయన కుమార్తె కూడా దరఖాస్తు చేసుకున్నారు. కరీంనగర్‌ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్‌ సోదరుడు రంగారావు కుమార్తె రమ్యారావు, ఆమె కుమారుడు రితేష్‌రావు దరఖాస్తు చేశారు. ముషీరాబాద్‌ టికెట్‌ కోసం కాంగ్రెస్‌ నేత అంజన్‌ కుమార్‌ యాదవ్‌, ఆయన కొడుకు అనిల్‌కుమార్‌ యాదవ్‌ అర్జీ పెట్టుకున్నారు. ఎమ్మెల్యే సీతక్క, ఆమె కుమారుడు సూర్య దరఖాస్తు చేశారు. జూబ్లీహిల్స్‌ నుంచి పీజేఆర్‌ కుమారుడు పి విష్ణువర్ధన్‌రెడ్డి, ఖైరతాబాద్‌ నుంచి పి విజయారెడ్డి, హుజురునగర్‌, కోదాడ నుంచి భార్యాభర్తలు ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉత్తమ్‌ పద్మావతి దర ఖాస్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఎల్బీనగర్‌ నుంచి మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌, కంటోన్మెంట్‌కు సర్వే సత్యనారాయణ, కొల్లాపూర్‌ నుంచి యువ నేత కేతూరి వెంకటేష్‌, మిర్యాలగూడ నుంచి వికలాంగుల చైర్మెన్‌ ముత్తినేని వీరయ్య అర్జీ పెట్టుకున్నారు. సీనియర్‌ నేతలు వి హనుమంతరావు, నాగం జనార్థన్‌రెడ్డి, గీతారెడ్డి, రేణుకాచౌదరి దరఖాస్తు చేసుకోలేదు.
ఐదేండ్లపాటు పార్టీకి సమయమిస్తే టికెట్‌ ఇవ్వొచ్చు
ఒకే కుటుంబానికి రెండు టికెట్లు కేటాయించకూడదనే నిబంధనపై ఉదరుపూర్‌ కాంగ్రెస్‌ చింతన్‌ శిబిర్‌లో స్పష్టత ఇచ్చింది. పార్టీ కోసం కనీసం ఐదేండ్లపాటు సమయం కేటాయించినట్టైతే ఒక కుటుంబంలోని రెండో సభ్యుడికి టిక్కెట్‌ ఇచ్చే విషయాన్ని ఆలోచించవచ్చు అని తెలిపింది.