– బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమల్లో మోసాలకు పాల్పడుతోందని బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో 13 హామీలున్నాయనీ, అందులో ఇప్పటి వరకు రెండింటినే అమలు చేసారనీ, ఈ నెల మరో రెండు అమలు చేస్తామని ప్రకటించారని తెలిపారు. అయితే మొత్తం గ్యారంటీలు అమలు చేయకుండా ఆరుగ్యారంటీల్లో నాలుగు అమలు చేశామనీ ఇంకా రెండే మిగిలి ఉన్నాయని అబద్దపు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ హమీల అమలును మసిపూసి మారేడు కాయ చేస్తుందని విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్ హయాంలో పరీక్షలు నిర్వహించిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి తామే ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పటాన్ని ఆయన తప్పు పట్టారు. ఈ మోసాలను ఎక్కడికక్కడ ప్రజలు ఎండగట్టాలని పిలుపు నిచ్చారు.