రైతుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని: ఎమ్మెల్యే

నవతెలంగాణ – మిరు దొడ్డి 
రైతుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండలం కాసులాబాద్ గ్రామంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వేసవి కాలం నేపథ్యంలో సాగుచేసిన పంటలు ఎండు ముఖం పడుతున్నందున మల్లన్న సాగర్ నుంచి పంట కాలువల ద్వారా సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోరుబావుల్లోని నీరు వట్టిపోతున్నాయన్నారు. సాగునీరు లేక పోవడంతో సాగుకు  పెట్టిన పెట్టుబడి దక్కడం లేదన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రులు స్పందించి రైతులకు సాగునీరు  అందించాలన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడవెల్లి వాగు జీవధారగా మారిందని గుర్తు చేశారు. పంట కాలువల ద్వారా దుబ్బాక నియోజకవర్గం తో పాటు మెదక్ నియోజకవర్గాల రైతులకు సైతం సాగునీరు అందించాలన్నారు. పంట కాలువల ద్వారా సాగునీరు అందించకపోతే రైతుల పక్షాన నిలబడి ధర్నాలు రాస్తారోకోలు చేస్తామన్నారు.