– విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
నవతెలంగాణ – అచ్చంపేట: ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య సంకేతం లోపం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి విచ్చిన్నం కాక తప్పదని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. బుధవారం పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయించిన ఎల్ఆర్ఎస్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రయోజనాలను మర్చిపోయి ఎల్ ఆర్ ఎస్ ద్వారా 20వేల కోట్ల రూపాయలు దోపిడీ చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుంది అన్నారు. ఎన్నికల కోసం సాధ్యం కానీ హామీలను ప్రకటించి వాటిని అమలు చేయకుండా ఓట్లు దండుకొని పేద ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎల్ ఆర్ ఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు అందులో భాగంగానే అచ్చంపేటలో నిరసన చేయాలని భావించినప్పటికీ రెవెన్యూ అధికారులు పోలీసులు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా చూపుతూ నిరసన చేయడానికి అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. 4000 ప్రతినెల పింఛన్ ఇస్తామని, రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఎకరానికి 15 వేల రూపాయలు పెట్టుబడి సహాయం ఇస్తామని మాయమాటలు చెబుతూ రైతులను ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అన్నారు. ప్రజల సమస్యలను అభివృద్ధి పనులను మరిచిపోయి ఎం ఎల్ సి, పార్లమెంటు ఎన్నికల పైన ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు. ప్రజల ప్రయోజనాల కోసం ఉద్యమాలను ఉదృతం చేస్తామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్, నరసయ్య యాదవ్, రమేష్ రావు, రమేష్ తదితరులు ఉన్నారు.