– చట్టం ముందు అందరూ సమానమే : టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్ గౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలుగు చిత్ర సీమకు కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని బంధం ఉందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్ గౌడ్ గుర్తు చేశారు. అల్లు అర్జున్ మామ తమ పార్టీకి చెందిన నాయకుడేనన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి, అల్లు అర్జున్ కుటుంబానికి బంధుత్వం ఉందని చెప్పారు. అయినా, చట్టానికి ఎవరూ అతీతులు కాదనీ, చట్టం ముందు అందరూ సమానమేనన్నారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో సామాన్యురాలు ప్రాణాలు కోల్పోయిందనీ, ఆమె కొడుకు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఫిలిమ్ స్టూడియోలను నిర్మించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భూములు ఇచ్చి వెసులుబాటు కల్పించిందని తెలిపారు. అందువల్లే చిత్రసీమ మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిందన్నారు. బీజేపీ నేతలు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. బీఆర్‌ఎస్ నేతలు రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు పెడుతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసిందన్నారు. పదేండ్లలో కేసీఆర్, కవిత, హరీశ్‌రావు, కేటీఆర్‌లకు తెలంగాణ తల్లి విగ్రహం మీద ధ్యాస ఎందుకు లేదని ప్రశ్నించారు. ఈ-కార్ రేసింగ్ స్కాంలో నిధుల గోల్‌మాల్ జరిగినట్టు అధికారులు గుర్తించారనీ, అందులో ముఖ్యంగా కేటీఆర్ అక్రమాలకు పాల్పడినట్టు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.