కొడంగల్‌లో కాంగ్రెస్‌కు మెజార్టీ

– తన బలం నిరూపించుకున్న సీఎం
– మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానం మాత్రం బీజేపీదే..
– రేవంత్‌ నియోజకవర్గంలో ఆధిక్యత కనబరచని డీకే
నవతెలంగాణ-కొడంగల్‌
మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య హౌరాహౌరీ పోరు సాగింది. కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచందర్‌రెడ్డిపై బీజేపీ అభ్యర్థి డీకే అరుణ 3,410 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఇందులోనే సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్‌ అసెంబ్లీ స్థానం ఉంది. ఇక్కడ కాంగ్రెస్‌ అధిక్యం ప్రదర్శించింది. ఈ నియోజక వర్గంలో కాంగ్రెస్‌కు సుమారు 22వేల పైచిలుకు మెజార్టీ లభించింది. మహబూబ్‌నగర్‌లో బీజేపీ గెలిచినప్పటికీ సొంత నియోజకవర్గంలో సీఎం రేవంత్‌రెడ్డి తన బలాన్ని నిరూపించుకున్నారు.
మహబూబ్‌నగర్‌ సీఎం సొంత నియోజకవర్గం కావడంతో సీఎం రేవంత్‌రెడ్డి పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా మహబూబ్‌గర్‌ నుంచి చల్లా వంశీ చందర్‌ రెడ్డిని తొలి అభ్యర్థిగా ప్రకటించారు. ఎన్నికల ప్రచారం ప్రారంభం నుంచి రేవంత్‌ రెడ్డి అత్యధిక సార్లు ఆ నియోజకవర్గంలో పర్యటించారు. బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీ కి క్రాస్‌ ఓటింగ్‌ జరుగుతుందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారసభల్లో చెప్పుకుంటూ వచ్చారు. బహిరంగ సభలు నిర్వహించి వంశీచందర్‌రెడ్డిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే స్థానిక కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం ఆయా నియోజకవర్గాల్లో తగు జాగ్రత్తలు తీసుకోలేకపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి 30వేలకు పైగా మెజార్టీ సాధించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా అంతకంటే ఎక్కువ మెజార్టీ ఇవ్వాలని ప్రజలను కోరారు. అయితే ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో మాత్రం కొడంగల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు 22వేల మెజార్టీ వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పొలిస్తే 8 వేల మెజార్టీ తగ్గినా బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మాత్రం కొడంగల్‌లో తన ప్రభావం చూపించలేకపోయారు.