బీజేపీ కంటే కాంగ్రెస్‌కే అధిక ఓట్లు

బీజేపీ కంటే కాంగ్రెస్‌కే అధిక ఓట్లుఐదు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలు చేజారినా.. ఓటరు ఆదరణ
న్యూఢిల్లీ: సెమీఫైనల్‌గా భావించిన ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల సరళిని పరిశీలిస్తే.. కాంగ్రెస్‌కు కీలకమైన రెండు పెద్ద రాష్ట్రాలు చేజారినా.. బీజేపీ కంటే కాంగ్రెస్‌కే ఎక్కువ ఓట్లు పడ్డాయి. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, తెలంగాణ , మిజోరంలలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించగా… మూడు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి కిందామీదా పడుతోంది. తెలంగాణలో కాంగ్రెస్‌ మెజారిటీ మార్కును దాటేసింది. రేవంత్‌ రెడ్డి సీఎంగా ఎంపిక సైతం పూర్తయింది. మరోవైపు రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లు కాంగ్రెస్‌ హస్తం నుంచి చేజారినా.. కాంగ్రెస్‌ సీట్లు తగ్గినా ఓట్ల శాతంలో పెద్దగా మార్పు లేదు. బీజేపీ తమ ఓటర్ల సంఖ్యను పెంచుకోవడంలో విజయం సాధించామన్న విశ్వాసం ఆ పార్టీలో కనిపిస్తోంది. అయితే మొత్తం ఐదు రాష్ట్రాల ఓట్లను పరిశీలిస్తే.. బీజేపీ కంటే కాంగ్రెస్‌కే ఎక్కువ ఓట్లు వచ్చినట్టు తేలింది.
మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు
మధ్యప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ కంటే బీజేపీకి దాదాపు 35 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఈ దూరం కాస్త తక్కువ. ఇక్కడ కాంగ్రెస్‌ కంటే బీజేపీకి 6 లక్షలా 32 వేల ఓట్లు ఎక్కువ వచ్చాయి. రాజస్థాన్‌లో కూడా ఓట్ల తేడా పెద్దగా లేదు. ఇక్కడ బీజేపీకి 8 లక్షలా 56 వేల ఓట్లు అధికంగా వచ్చాయి. అయితే తెలం గాణ, మిజోరంలను పరిశీలిస్తే కాంగ్రెస్‌ ముందుంది.
తెలంగాణలో బీజేపీ కంటే కాంగ్రెస్‌కు 59 లక్షలా 78 వేల ఓట్లు ఎక్కువ వచ్చాయి. మిజోరంలో బీజేపీ కంటే కాంగ్రెస్‌కు లక్షా 10 వేల ఓట్లు ఎక్కువ వచ్చాయి. మొత్తం ఐదు రాష్ట్రాల పూర్తి చిత్రాన్ని పరిశీలిస్తే, బీజేపీ కంటే కాంగ్రెస్‌కు 10 లక్షలా 55 వేల ఓట్లు ఎక్కువ వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రదర్శన బాగానే ఉన్నది.అయితే రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో ఓట్ల తేడా పెద్దగా లేదు.
సీట్ల సంఖ్యలో భారీ వ్యత్యాసం ఉన్న మాట వాస్తవమే. కాంగ్రెస్‌ రెండు రాష్ట్రాలను కోల్పోయి నప్పటికీ, దాని ఓటర్ల సంఖ్య ఇప్పటికీ బీజేపీకి సవాలుగా మారనుంది.
కాంగ్రెస్‌-బీజేపీకి వచ్చిన సీట్లు
మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 స్థానాలకు గానూ 163 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్‌కు 66 సీట్లు వచ్చాయి. కాగా భారత్‌ ఆదివాసీ పార్టీ ఖాతాలో ఒక సీటు చేరింది. రాజస్థాన్‌లో బీజేపీకి మెజారిటీ వచ్చింది. ఆ పార్టీకి 115 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ 69 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది.
భారత్‌ ఆదివాసీ పార్టీకి 3 సీట్లు, బీఎస్పీకి 2 సీట్లు, ఆర్‌ఎల్‌డీ, ఆర్‌ఎల్‌టీపీకి ఒక్కో సీటు దక్కింది. స్వతంత్రులు 8 స్థానాల్లో విజయం సాధించారు. ఛత్తీస్‌గఢ్‌లోని 90 అసెంబ్లీ స్థానాలకు గాను 54 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ ఖాతాలో 35 సీట్లు వచ్చాయి. గోండ్వానా గంతంత్ర పార్టీ (జీజీపీ) ఒక స్థానాన్ని గెలుచుకుంది.
తెలంగాణలో కాంగ్రెస్‌ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. మొత్తం 119 సీట్లలో 64 సీట్లు పార్టీ ఖాతాలోకి వెళ్లాయి. బీఆర్‌ఎస్‌కు 39, బీజేపీకి 8, ఎంఐఎంకు 7, సీపీఐకి ఒక సీటు వచ్చాయి.
మిజోరంలో జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (జెడ్‌పీఎం) ఇక్కడ అతిపెద్ద పార్టీగా అవతరించింది. జెడ్‌పీఎం 27, ఎంఎన్‌ఎఫ్‌ 10, బీజేపీ 2, కాంగ్రెస్‌ ఒక సీటు మాత్రమే గెలుచుకున్నాయి.