– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహరావు పేరు ఎత్తే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం ఓ జాతీయ వార్తా సంస్థతో మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడైన పీవీని కాంగ్రెస్ పార్టీ ఘోరంగా అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానిగా పనిచేసిన నాయకుడికే పార్టీ టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. చనిపోయిన వ్యక్తిని గౌరవించాలన్న కనీస మర్యాద లేక పోగా ఆయన పార్థీవ దేహాన్ని ఏఐసీసీ కార్యాలయానికి రానివ్వకుండా అడ్డుకున్న సంగతిని తెలంగాణ ప్రజలు మర్చిపోరని అన్నారు. .పీవీ కుటుంబానికి కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం పీవీ నరసింహారావు శతజయంతిని ఘనంగా జరపడంతో పాటు భారతరత్న ఇవ్వాలని కోరిందని గుర్తు చేశారు. ఎన్నడూ ఉద్యమం చేయని..ఉద్యోగం చేయని, రాహూల్ గాంధీ యువత గురించి మాట్లాడటం హాస్యాస్పదమని విమర్శించారు. రాహుల్ ఒక రాజకీయ నిరుద్యోగి..ఆయన ఉద్యోగం కోసం నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి చిచ్చుపెట్టాలని చూస్తున్నాడని ఆయన విమర్శించారు.