– సీఎం అనే రెండక్షరాలకన్నా కేసీఆర్ అనే మూడక్షరాలే పవర్‌ఫుల్
– త్వరలోనే పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు : ఖమ్మం పార్లమెంటు సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రజల విశ్వాసాన్ని స్వల్పకాలంలో కోల్పోయే లక్షణం ఒక్క కాంగ్రెస్‌కే సొంతమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. గత చరిత్రను పరిశీలిస్తే ఇదే విషయం అర్థమవుతోందని ఆయన అన్నారు. కేసీఆర్ అధికారంలో ఉండటం కంటే ప్రతిపక్షంలో ఉండటమే కాంగ్రెస్‌కు ప్రమాదకరమని హెచ్చరించారు. ఖమ్మం పార్లమెంటు సన్నాహక సమావేశం సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కార్యకర్తలు, నాయకులనుద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు. సీఎం అనే రెండక్షరాలకన్నా కేసీఆర్ అనే మూడక్షరాలే చాలా పవర్‌ఫుల్ అంటూ ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకునే నిజాయితీ, చిత్తశుద్ధి కాంగ్రెస్‌లో కనబడటం లేదని విమర్శించారు. ఇప్పటి మాదిరే 1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని తిరస్కరించి, కాంగ్రెస్‌ను గెలిపించిన ప్రజలు…కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే ఆ పార్టీ మీద విశ్వాసం కోల్పోయారని గుర్తు చేశారు. అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయిందని తెలిపారు. ఇలాంటి వాస్తవాలు, చరిత్రను మనం మరువరాదంటూ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తెల్లారి నుంచే వాగ్దానాలను అమలు చేస్తామంటూ నమ్మబలికిన సీఎం రేవంత్… వాటిపై కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. దీనిపై ప్రజల్లో ఇప్పటికే అసహనం పెరిగిపోతోందని చెప్పారు. ఈ పరిస్థితి మున్ముందు మరింత ఎక్కువవుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ పోరాడాలని బీఆర్‌ఎస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఆ దిశగా కార్యోన్ముఖులు కావాలంటూ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్‌ఎస్ పోరాట పటిమను ప్రజలు ప్రత్యక్షంగా చూశారని కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. రానున్న రోజుల్లో కేసీఆర్ శాసనసభకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని కాంగ్రెస్‌కు హితవు పలికారు. ఫిబ్రవరిలో ఆయన ప్రజల మధ్యకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్‌సభ సన్నాహక సమావేశాలు ముగియగానే అసెంబ్లీ నియోజకవర్గాలపై సమీక్షలు ఉంటాయని తెలిపారు. త్వరలోనే పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తామని వివరించారు.ప్రతీ రెండు మూడు నెలలకొకసారి క్రమం తప్పక అన్ని కమిటీల సమావేశాలను నిర్వహిస్తామని తెలిపారు. సన్నాహక సమావేశంలో బీఆర్‌ఎస్ లోక్‌సభపక్ష నేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, మాజీ మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయకుమార్‌తోపాటు ఖమ్మం జిల్లాకు చెందిన తాజా మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.