ప్రజల చెంతకు కాంగ్రెస్ ప్రజాపాలన..

– ప్రజా పాలనలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
– సంక్షేమ పథకాల పేరుతో బీఆర్ఎస్ దోపిడి చేసిందని మండిపాటు

నవతెలంగాణ బెజ్జంకి: అర్హులైన నిరుపేదలకు సంక్షేమ పథకాల అందిచాలనే సదుద్దేశంతోనే ప్రజల చేంతకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమం చేపట్టిందని..కుటుంబాలన్నీ దరఖాస్తులు చేయాలని మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గురువారం మండల పరిధిలోని గుండారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే సత్యనారాయణ హజరై మాట్లాడారు. సంక్షేమ పథకాల పేరుతో పదేండ్లు పరిపాలన సాగించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా ధనాన్ని దోపిడి చేసిందన్నారు.  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని.. ప్రజల కోసమే పని చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని పారదర్శకంగా ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేస్తామన్నారు. గత ప్రభుత్వంలో పార్టీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అందజేస్తామని ప్రజాప్రతినిధులు బాహాటంగానే ప్రకటించారని పార్టీ కోసం కార్యకర్తలని.. ప్రజల కోసం ప్రభుత్వమని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే సత్యనారాయణ సర్పంచ్ శెట్టి లావణ్య, తహసిల్దార్ శ్యామ్ తో కలిసి ప్రజల నుండి అభయహస్తం దరఖాస్తులు స్వీకరించారు. అంతకుముందు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ముత్తన్నపేట గ్రామానికి చెందిన రేవోజు స్వరూప వైద్య ఖర్చుల నిమిత్తం రూ.2 లక్షల ఎల్ఓసీ ఉప సర్పంచ్ సుధీర్ రెడ్డి, మండల నాయకులతో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. ప్రజా పాలన కార్యక్రమానికి అయా శాఖల అధికారులు, గ్రామస్తులు హజరయ్యారు.