– బీఆర్‌ఎస్ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్
నవతెలంగాణ-మల్హర్ రావు : తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, ఐటీ పరంగా, వ్యవసాయ రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్‌లు ముందుకు తీసుకెళ్తుంటే కాంగ్రెస్‌పార్టీ మాత్రం తెలంగాణను మళ్లీ చీకట్లోకి నెట్టాలని ఆలోచన కక్ష్య పూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్‌పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ ఆరోపించారు.మంథని మండలం నాగారం గ్రామంలో 24గంటల సరఫరాపై రైతులతో కలిసి పంట పొలాలను సందర్శించి బోరుమోటార్‌లను ఆన్ చేసి పరిశీలించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సంతోషంగా, మంచి వాతావరణంలో ఉంటే ఓర్వలేకపోతున్నారని ఆయన విమర్శించారు. కర్ణాటక రాష్ట్రంలో పది గంటల కరెంటు ఇస్తామని హమీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఐదు గంటలు కూడా సక్రమంగా ఇవ్వడంలేదన్నారు. రేపటి రోజున కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మనకు ఇన్వర్టర్లు, జనరేటర్‌లు రాక తప్పదన్నారు. అమెరికా నుంచి మొదలు తెలంగాణ వరకు రేవంత్‌రెడ్డి ప్రతి రోజు రైతులకు ఇచ్చే కరెంటుపై వివిధ రకాలుగా మాట్లాడుతున్నారని, ఎకరాకు గంట, మూడు ఎకరాలకు మూడు గంటల చొప్పున కరెంటు ఇస్తామంటూ చెబుతున్నారని, ఒక రైతుకు పది ఎకరాలు ఒకే చోట ఉంటే ఆ రైతుకు ఎంత కరెంటు ఇస్తారని, ఇచ్చే కరెంటు ఏఏ సమయాల్లోఇస్తారో చెప్పడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని, ఆ విషయాలను ప్రజలకు చెప్పితే తాము అలా అనడం లేదని కావాలనే బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు బురద జల్లుతాండ్లని అంటున్నారని అన్నారు. వాళ్లు మాట్లాడిన వీడియోల ఆధారాలుఉన్నా వాస్తవాలను ఒప్పుకోవడం లేదని విమర్శించారు. ప్రజలకు ఆలోచన లేదని, చైతన్యం రాలేదని బావిస్తున్నారని,తాము ఏది చెప్పితే అదే నమ్ముతారని అనుకుంటున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ నాయకుల మనస్సు ఉన్న మాటలనే చెప్తున్నారని, వాళ్లు అదికారంలోకి వస్తే కర్ణాటక తరహాలోనే గోస పడుతామని ఆయన అన్నారు. కాంగ్రెస్ వేళా పాల లేని కరెంటు కావాలో బీఆర్‌ఎస్ సర్కార్ ఇచ్చే 24గంటల కరెంటు కావాలో ప్రజలు ఆలోచన చేయాలని అన్నారు. ఈనాడు రైతు ఏ సమయంలోనైనా పంట పొలాల వద్దకువెళ్లి మోటార్‌లు ఆన్ చేసుకునే విధంగా కరెంటు సరఫరా జరుగుతుందని, ఇందుకు నాగారంలో మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మోటర్ ఆన్ చేయడమేనని ఆయన అన్నారు. ఎన్నికలు వచ్చాయని పథకాల పేరుతో మోసం చేయాలని చూస్తున్నారని, కరెంటు విషయంలో రైతుల పట్ల కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్న తీరు ముందే అర్థం అవుతోందని ఆయన అన్నారు. కరెంటుపై ఆధారపడి పంట సాగు చేసే రైతులు ఆలోచన చేయాలని, 24గంటల కరెంటుతోపాటు రైతుసంక్షేమాన్ని కోరే బీఆర్‌ఎస్‌పార్టీని అండగా నిలువాలని ఆయన పిలుపునిచ్చారు.