ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉంది

ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉంది– మంత్రి దామోదర రాజనర్సింహా
– వర్గీకరణతో మాదిగల జీవితాల్లో సామాజిక,ఆర్థిక అభివృద్ధి సాధ్యం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. ఎస్సీ వర్గీకరణ ఎవరికీ వ్యతిరేకం కాదని, జనాభా ప్రాతిపదికన ఎవరి వాటా వారికి దక్కాలని ఈ వ్యవహారంలో లీగల్‌ అంశాలు, సవరణలకు తమ ప్రభుత్వం సిద్ధమని చెప్పారు. తెలంగాణలో దళితులకు సామాజిక న్యాయం కావాలంటే ఎస్సీ వర్గీకరణ ఒక భాగమైతే, సబ్‌ ప్లాన్‌ రెండో భాగమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వాగ్థానం చేసినట్లుగానే వర్గీకరణ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించనున్నట్లు వెల్లడించారు. మంగళవారం నాడిక్కడ తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, లక్ష్మీకాంతారావు, అడ్లూరి లక్ష్మణ్‌, ఎస్సీ కమిషన్‌ మాజీ చైర్మెన్‌ పిడమర్తి రవి, పీసీసీ జనరల్‌ సెక్రెటరీ కొండేటి మల్లయ్య, కాంగ్రెస్‌ నేత మురళీధర్‌ రావుతో కలిసి మంత్రి దామోదర మీడియాతో మాట్లాడారు. వర్గీకరణ విషయంలో ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ముందు వాదనలు ప్రారంభమైనట్లు చెప్పారు. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం కూడా భాగమైన నేపథ్యంలో తామంతా సుప్రీంకోర్టు ముందు హాజరైనట్లు తెలిపారు. మాదిగ వర్గానికి మేలు జరిగేలా తెలంగాణ తరపు రాష్ట్ర ప్రభుత్వం మాజీ సొలిసిటర్‌ జనరల్‌ వివేక్‌ కష్ణ థన్కాను నియమించిందన్నారు. సీఎం రేవంత్‌ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ ఏర్పాట్లపై తమకు డైరెక్షన్‌ ఇచ్చారన్నారు. ఈ కేసు విచారణ త్వరగా పూర్తై తొందర్లోనే సుప్రీంకోర్టులో తమకు సానుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు.
బీఆర్‌ఎస్‌ ఆదివాసీ, దళిత వర్గాలను విస్మరించింది
తొమ్మిదిన్నర ఏండ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ ఆదివాసీలు, దళితుల అస్థిత్వం కోల్పోయేలా వ్యవహరించిందని మంత్రి విమర్శించారు. ఇటీవల జరిగిన రాష్ట్ర క్యాబినెట్‌లో ప్రభుత్వ రాజ ముద్ర, టీఎస్‌ ప్లేస్‌లో టీజీ నెంబర్‌ ప్లేట్‌ల మార్పు, తెలంగాణ తల్లి రూపుపై ప్రజాభిప్రాయం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అలాగే గద్దర్‌, అందెశ్రీ సహా అనేక మంది త్యాగమూర్తులకు ప్రభుత్వం తగిన గుర్తింపు, గౌరవం కల్పిస్తోందని చెప్పారు. ఈ నిర్ణయాలతో తెలంగాణ కోసం పోరాడిన కవులు, కళాకారులు, ఆదివాసీలు, దళితుల పక్షాన కాంగ్రెస్‌ ప్రభుత్వం నిలుస్తుందన్న సంకేతాలను పంపుతున్నట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్‌, లక్ష్మీకాంత రావు, సత్యనారాయణ మాట్లాడుతూ… చట్ట సభల్లో మాదిగల ప్రాతినిధ్యం తగ్గిందన్నారు. గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ సైతం ఎస్సీల్లో మాల వర్గానికి పెద్ద పీఠ వేసీ తమకు అన్యాయం చేసిందని చెప్పారు. జనాభా ప్రాతిపాదికన ఎస్సీ వర్గీకరణ జరగాలని పిడమర్తి రవి డిమాండ్‌ చేశారు.