గ్యారంటీలు అమలు చేసి చూపించిన ఘనత కాంగ్రెస్‌దే

నవతెలంగాణ – బోనకల్‌
ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారంటీలను అమలు చేసి చూపించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందని టిపిసిసి సభ్యులు పైడిపల్లి కిషోర్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎలక్షన్‌ కోడ్‌ తర్వాత మరో గ్యారంటీని కూడా అమలు చేసి కాంగ్రెస్‌ తన నిబద్ధతను చాటుకుంటుందన్నారు. పార్లమెంట్‌ ఎలక్షన్‌ తర్వాత బీఆర్‌ఎస్‌ కనుమరుగవుతుందన్నారు. తన ఉనికిని కాపాడుకోవడం కోసమే జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌ రాజు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని పార్టీలు మారినా మూడుసార్లు మధిర నియోజకవర్గంలో నుంచి పోటీ చేసినా ప్రజలు తిరస్కరించడంతో దిక్కుతోచని స్థితిలో ఉండి కాంగ్రెస్‌పై ఆరోపణ చేస్తున్నారని విమర్శించారు. పదేళ్ల బిఆర్‌ఎస్‌ పాలనలో డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి ఇలా మొత్తం అసత్య హామీలతో ప్రజలను బీఆర్‌ఎస్‌ నిండా ముంచిందని విమర్శించారు. వచ్చే పార్లమెంట్‌ ఎలక్షన్‌లో బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు గల్లంతవుతాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిందని, దేశంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడబోతుందన్నారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు గాలి దుర్గారావు, కలకోట సొసైటీ చైర్మన్‌ కర్నాటి రామకోటేశ్వరావు, వైస్‌ ఎంపీపీ గుగులోతు రమేష్‌, మాజీ సర్పంచ్‌ చిలక వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు మారుపల్లి ప్రేమ్‌కుమార్‌, నాయకులు గూడ నరసయ్యశాస్త్రి, పల్లిపాటి తిరుపతిరావు, బుక్య బద్రునాయక్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.