కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వంలా కాదు..

– బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి బీసీ బంధు ఇస్తాం 

పూర్తి పారదర్శకతతో లబ్ధిదారుల ఎంపిక
– హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్
నవతెలంగాణ -హుస్నాబాద్ రూరల్ 
బీసీలకు కాంగ్రెస్ ,టిడిపి పార్టీలు అధికారంలో ఉండి ఏమి చేయలేదని, ఆ ప్రభుత్వాలలా  కాకుండా బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి బీసీకి బీసీ బందు ఇస్తామని హుస్నాబాద్ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గంలోని హుస్నాబాద్ మున్సిపల్, హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలకు చెందిన 295 మంది లబ్ధిదారులకు బీసీ బందు పథకం ద్వారా మంజూరైన రూ.2 కోట్ల 95 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ బీసీల ఆర్థిక స్వావలంబన, కులవృత్తుల పరిరక్షణ కోసం సీఎం కేసీఆర్ బీసీ బందు పథకం ప్రవేశపెట్టారని అన్నారు. నియోజకవర్గంలో 7232 మంది బిసి బంధు కు అప్లై చేసుకోగా 6022 మందిని లబ్ధిదారులుగా గుర్తించామన్నారు. బీసీ బందు ప్రక్రియ  నిరంతరం కొనసాగుతుందని ఎవరు ఆందోళన పడవలసిన పని లేదన్నారు .అర్హులైన ప్రతి ఒక్కరికి బీసీ బంధు అందుతుందని అన్నారు. అక్కన్నపేట మండలం 39, హుస్నాబాద్ మండలం 30, హుస్నాబాద్ మున్సిపాలిటీ 33, కోహెడ 44, చిగురుమామిడి 33, సైదాపూర్ 43, భీమదేవరపల్లి 36, ఎల్కతుర్తి 35, వేలేరు మండలం 2 బీసీ బంధు చెక్కులను పంపించేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పదివేల రూపాయల రుణం కోసం బ్యాంకుల చుట్టూ పడిగాపులు కాస్తూ, గ్యారంటీల కోసం ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితులు ఉండేవన్నారు. నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో మొట్టమొదటిసారి కుల వృత్తుల అభివృద్ధి కోసం ఎలాంటి హామీ లేకుండా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. ప్రతి పైసా సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఉమ్మడి రాష్ట్రంలో కులవృత్తులు మరుగున పడిపోయాయని సీఎం కేసీఆర్  కులవృత్తులకు మళ్లీ జీవం పోసారని కొనియాడారు . గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ, ముదిరాజు సోదరులకు చెరువులలో ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను వదులుతుందన్నారు. చెరువులపై వాళ్లకు హక్కులు కల్పించామని, దళిత బంధు, బీసీ బంధు, రైతులకు రైతు బీమా, రైతు బంధు, రుణమాఫీ వివిధ సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రం ముందుదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా అద్భుతంగా పరిపాలన సాగిస్తూ సీఎం కేసీఆర్  నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు.
బీసీ బంధుతో పేదరిక  నిర్మూలన…
సిద్దిపేట జడ్పీ చైర్మన్ రోజా శర్మ 
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అందిస్తున్న బీసీ బందుతో పేదరిక నిర్మూలన జరుగుతుందని సిద్దిపేట జెడ్పి చైర్మన్ రోజా శర్మ అన్నారు. బీసీ బంద్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కులవృత్తులు కనుమరుగు అవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అండగా నిలిచిందన్నారు. బ్యాంకు లింకేజి లేకుండా ప్రభుత్వ ఇచ్చే బీసీ బందుతో మీ కుటుంబాలు బాగుండాలన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో నిస్వార్థంతో పనిచేస్తున్న ఎమ్మెల్యే సతీష్ కుమార్ భారీ మేజరిటితో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జడ్పీ చైర్మన్ సుదీర్ కుమార్, సిద్దిపేట ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీరామ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, మార్కెట్ చైర్మన్ ఎడబోయిన రజిని తిరుపతిరెడ్డి, హుస్నాబాద్ ఎంపీపీ లకవత్ మానస ,జెడ్పిటిసి భూక్యా మంగ, వివిధ మండలాల ఎంపీపీలు జెడ్పీటీసీలు  కీర్తి, అనిత, వినిత, స్వప్న హుస్నాబాద్ బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు వంగ వెంకట్రాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.