సెప్టెంబర్‌ 17న కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో

– ఓబీసీ, మహిళ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ డిక్లరేషన్లు విడుదల చేస్తాం
– సోమేష్‌కుమార్‌ నియామకంపై కోర్టుకు వెళ్తాం : ఇష్టాగోష్టిలో రేవంత్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రానున్న ఎన్నికల దృష్ట్యా సెప్టెంబర్‌ 17న కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను విడుదల చేస్తామని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి వెల్లడించారు. అదే విధంగా ఓబీసీ, మహిళ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ డిక్లరేషన్లు విడుదల చేస్తామన్నారు. హైదరాబాద్‌ యూత్‌ డిక్లరేషన్‌ సభ విజయవంతమైందని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో రేవంత్‌ విలేకర్లతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఐటీఐ, ప్రతి పార్లమెంట్‌కు ఒక పాలిటెక్నిక్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తామన్నారు. దేశంలో సీపీఎస్‌ను అమలు చేసింది కాంగ్రెస్‌ పార్టీయేనన్నారు. సెప్టెంబర్‌ 17ను స్వతంత్ర దినోత్సవంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఓబీసీ జనగణన నిర్వహించి, జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయిస్తామన్నారు. బీజేపీ కోసం కర్ణాటక ఎన్నికల్లో కేసీఆర్‌ పని చేశారని ఆరోపించారు. కర్ణాటకలో ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ ఎందుకు ప్రచారం చేయలేదని ప్రశ్నించారు. యూత్‌ డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు అవినీతిపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామనీ తెలిపారు. అదే విధంగా మాజీ సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ నియామకంపై కోర్టులో కేసు వేస్తామని వివరించారు. సలహాదారులకు క్యాబినెట్‌ హౌదా ఇవ్వడానికి అవకాశం లేదని తెలిపారు.