ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్‌ : మోడీ

Mislead people Congress that cares: Modi‘వికసిత్‌ భారత్‌ వికసిత్‌ జమ్మూకాశ్మీర్‌’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ శ్రీనగర్‌లో పర్యటించారు. రూ.6,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, వాటిని జాతికి అంకితం చేశారు. ఆర్టికల్‌ 370 రద్దుపై కాంగ్రెస్‌, దాని భాగస్వామ్య పక్షాలు జమ్మూకాశ్మీర్‌ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన విమర్శించారు. నగరంలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తూ జమ్మూకాశ్మీర్‌ విజయ గాథ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందని, ఇక్కడి సరస్సుల్లో ఎక్కడ చూసినా ‘కమలం’ కన్పిస్తోందని చెప్పుకొచ్చారు. ‘యాభై సంవత్సరాల క్రితం ఏర్పడిన జమ్మూకాశ్మీర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ లోగో కమలం. బీజేపీ గుర్తు కూడా అదే. కమలంతో రాష్ట్రానికి గాఢమైన అనుబంధం లేదా?’ అని ప్రశ్నించారు. వివాహాలు చేసుకునేందుకు ప్రజలు జమ్మూకాశ్మీర్‌ వస్తున్నారని, ఇక్కడ జీ-20ని నిర్వహించడాన్ని ప్రపంచం చూసిందని అన్నారు. ఒకప్పుడు జమ్మూకాశ్మీర్‌కు ఎవరు వెళతారని జనం అనుకునే వారని, ఇప్పుడు రాష్ట్రంలో పర్యాటకం అన్ని రికార్డులను అధిగమించిందని చెప్పారు. గత సంవత్సరం రెండు కోట్ల మందికి పైగా ప్రజలు రాష్ట్రాన్ని సందర్శించారని తెలిపారు. అభివృద్ధి చెందిన భారత్‌ ప్రాధాన్యత రాష్ట్ర అభివృద్ధేనని అన్నారు. కొత్తగా ఎంపికైన ప్రభుత్వోద్యోగులకు మోడీ ఈ సందర్భంగా నియామక పత్రాలు అందజేశారు.