కాంగ్రెస్‌ ఎంపీ రూ.290 కోట్ల అక్రమ సంపాదన స్వాధీనం

– ఐటీ దాడుల్లో ఇంత బయటపడటం ఇదే తొలిసారి
–  రాహుల్‌ గాంధీ జోడో యాత్రకు ఏర్పాటు చేసింది ధీరజ్‌ సాహునే : కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ ధీరజ్‌ సాహూ ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించగా రూ.290 కోట్ల అక్రమ సంపాదన బయట పడిందనీ, ఇంత పెద్ద మొత్తంలో దొరకడం దేశచరిత్రలో ఇదే తొలిసారి అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాంచీలోని 8 బ్యాంకుల్లో లాకర్స్‌ ఉన్నాయని గుర్తించి ఆదాయ పన్ను శాఖ అధికారులు సీజ్‌ చేశారని తెలిపారు. ధీరజ్‌ సాహూ రాహుల్‌గాంధీకి అత్యంత సన్నిహితుడనీ, జోడో యాత్రకు ఏర్పాట్లు మొత్తం దగ్గరుండి చేశారని గుర్తుచేశారు. ఈ అక్రమ సంపాదనపై రాహుల్‌ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఆ డబ్బు ఎవరిదో రాహుల్‌ గాంధీ చెప్పాలని నిలదీశారు. పార్లమెంట్‌ ఎన్నికల కోసం కూడబెడుతున్న నోట్ల గుట్టల్లా అవి ఉన్నాయని చెప్పారు. మూడుసార్లు ఓడిపోయిన వ్యక్తికి కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభకు ఎలా పంపిందని నిలదీశారు. రాహుల్‌ గాంధీకి ధీరజ్‌ వంటి అవినీతిపరులు ఎంత మంది సన్నిహితులు ఉన్నారో చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న చోట అవినీతి మూడు పువ్వులు, ఆరు కాయలుగా వెల్లివిరుస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీకి, అవినీతికి విడదియలేని బంధం ఉందని విమర్శించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రధాని మోడీకే ప్రజలు మూడోసారి పట్టం గడుతారని చెప్పారు.