– ఏడాదికి లక్ష రూపాయల నగదు బదిలీ
– కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం కోటా
– లోక్‌సభ ఎన్నికలకు ముందు మహిళలకు ఐదు వాగ్దానాలు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మహిళలకు ఐదు హామీలను ప్రకటించింది. వీటిలో దేశంలోని పేద కుటుంబాల్లోని ప్రతి ఒక్క మహిళకూ వార్షికంగా రూ. 1 లక్ష నగదు బదిలీ, కేంద్రం ప్రభుత్వ ఉద్యోగాల్లో అన్ని కొత్త రిక్రూట్‌మెంట్లలో 50 శాతం కోటా వంటివి ఉన్నాయి. పార్టీ ”నారీ న్యారు” హామీని ప్రకటించిం దనీ, దీని కింద దేశంలోని మహిళల కోసం కొత్త అజెండాను ఏర్పాటు చేయబోతున్నామని ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌లో షేర్ చేసిన వీడియోలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. ఇప్పటికే భాగస్వామ్య న్యాయం, రైతు న్యాయం, యువత న్యాయంపై కాంగ్రెస్ తన హామీలను ప్రకటించిందని ఖర్గే వివరించారు. ప్రత్యర్థులు పుట్టినప్పుడు మేం మేనిఫెస్టోలు రూపొందించి, ఆ ప్రకటనలను నెరవేరుస్తున్నామనీ, ఇది 1926 నుంచి ఇప్పటి వరకు మా రికార్డు అని ఆయన వీడియోలో చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడే ఈ పోరాటంలో మీరందరూ కాంగ్రెస్ పార్టీకి మీ ఆశీస్సులు అందిస్తూ, బలోపేతం చేయాలని ఖర్గే అన్నారు. మహారాష్ట్రలోని ధూలేలో జరిగిన ‘మహిళా సదస్సు’లో కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ప్రకటనలు చేశారు.
– ”మహాలక్ష్మి” హామీ కింద, ప్రతి పేద కుటుంబం నుంచి ఒక మహిళకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా సంవత్సరానికి రూ. 1 లక్ష రూపాయల సహాయం అందనున్నది.
-”ఆదీ ఆబాదీ పూరా హక్” కింద కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం కొత్త రిక్రూట్‌మెంట్‌లలో మహిళలకు రిజర్వ్ చేయనున్నది.
– ”శక్తి కా సమ్మాన్” హామీ కింద ఆశా, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులకు నెలవారీ వేతనానికి కేంద్రం ఇచ్చే సహకారం రెట్టింపు అవుతుందని ఖర్గే తెలిపారు.
– ”అధికార్ మైత్రి” హామీ కింద, కాంగ్రెస్ ప్రతి పంచాయతీలో ”అధికార్ మైత్రి”ని నియమిస్తుంది. ఇది మహిళలకు వారి చట్టపరమైన హక్కుల గురించి అవగాహన కల్పించటానికి, వాటిని అమలు చేయటంలో వారికి సహాయం చేయటానికి పారా లీగల్ కార్యకర్తగా పని చేస్తుంది.
– ”సావిత్రి బాయి ఫూలే హాస్టల్స్” హామీ కింద, దేశంలోని వర్కింగ్ ఉమెన్ హాస్టళ్ల సంఖ్యను రెట్టింపు చేస్తుంది. ప్రతి జిల్లాలో కనీసం ఒకటి ఉంటుంది.