ఓట్ల కోసమే.. కాంగ్రెస్ రాజకీయం

– బతికున్నప్పుడు పట్టించుకోలేదు… ఇప్పుడు గుర్తొచ్చారా..
– నాడు పీవీని నిర్లక్ష్యం చేసింది కాంగ్రెస్ కాదా..
– మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి లక్ష్మికాంత రావు 
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్: మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు పేరును ఉచ్ఛరించే నైతిక హక్కు, అర్హత కాంగ్రెస్ పార్టీకి, ప్రియాంక గాంధీకి లేవని, కేవలం ఓట్లకోసం పివి పేరును కాంగ్రెస్ పార్టీ వాడుకుంటోందని మాజీ ఎంపీ కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు ధ్వజమెత్తారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలోని బీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కెప్టెన్ మాట్లాడారు. హుస్నాబాద్ లో శుక్రవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ స్వర్గీయ పివి నరసింహారావు పేరుతో ఓట్లు అడగడాన్ని అయన తీవ్రంగా ఖండించారు.  నాడు మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు పివి నడిపారని, నాడు దేశ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా ఉండేదని, బంగారాన్ని తాకట్టు పెట్టిన దుస్థితి ఉందని, కానీ ఆర్థిక సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించారని అన్నారు. సరళీకృత ఆర్థిక విధానాలతో ప్రపంచమే గర్వించదగ్గ నేతగా అపార చాణక్యుడిగా గుర్తింపు పొందారని గుర్తు చేశారు. బహుభాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణల పితామహుడు, సాహితీవేత్త, తెలుగు ప్రజల గుండెచప్పుడు, తెలంగాణ కీర్తిని ప్రపంచ దేశాలకు చాటిన మహనీయుడు ఐన పివి ప్రధాని పీఠం నుండి 1996 లో దిగిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏనాడూ పట్టించుకోలేదన్నారు. పివి మృతి చెందితే కనీసం పట్టించుకోలేదని, అయన అంత్య క్రియల కార్యక్రమాన్ని కూడా సరిగ్గ నిర్వహించకపోతే.. ప్రజలు ఎంతో బాధ పడ్డారని అన్నారు. పివి అంత్య క్రియలు ఢిల్లీలో కాకుండా.. హైదరాబాద్ లో నిర్వహించారని, కాంగ్రెస్ జాతీయ కార్యాలయానికి కూడా పివి పార్థివ దేహాన్ని తీసుకుపోలేదన్నారు. తెలుగు ప్రజల మనోభావాలు నాడు కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసిందని, దీన్ని ప్రజలు మరచిపోలేదని, కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరాని అన్నారు. నాడు జరిగిన పరిణామాలకు తాను కూడా ప్రత్యక్ష సాక్షినని, నాడు వైఎస్ మంత్రివర్గంలో తాను ఉన్నానని, ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉన్న వై ఎస్ ను హుటాహుటిన హైదరాబాద్ పంపించి పివి పార్థివ దేహాన్ని ఢిల్లీ నుండి పివి ని నాడు నిర్లక్ష్యం చేసిన ఫలితం కాంగ్రెస్ అనుభవించిందని మండిపడ్డారు. పివి కీర్తిని తగ్గించే, ఆయనను క్రియాశీల రాజకీయాల నుండి కనుమరుగు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. పివిని, పివి చేసిన కృషిని బీఆర్ఎస్  గుర్తించిందని, సి ఎం కేసీఆర్ పివి శత జయంతి ఉత్సవాలను చారిత్రాత్మకంగా, ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారని  తెలిపారు. పివి పేరుతొ ఎన్నో కార్యక్రమాలు గ్రామగ్రామాన నిర్వహించారని, ఆయనపై సెమినార్లు, పత్రికల్లో వ్యాసాలు తదితర ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. పివి కుమార్తె సురభి వాణి దేవికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారని, పివి స్వగ్రామం వంగరలో పివి స్మృతి వనం నిర్మాణం కోసం పర్యాటక శాఖ నుండి నిధులు మంజూరు చేసిందని అన్నారు. పీవీ గ్రామంలో సిసి రోడ్లు పూర్తి స్థాయిలో నిర్మించిందని, గ్రామాభివృద్ధికి కృషి చేయడం జరిగిందని అన్నారు. పివి కృషి వల్లే.. నేడు.. కాంగ్రెస్ కొద్దో గొప్పో బతికి ఉందని, మన్మోహన్ సింగ్ పేరు చెప్పుకుని కాంగ్రెస్ ఇన్ని రోజులు బతికిందని, మన్మోహన్ సింగ్ ను కూడా వెలుగులోకి తీసుకువచ్చింది పివి అన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు., ఇది కాంగ్రెస్ గొప్పతనం కాదని, పివి, మన్మోహన్ సింగ్ ల గొప్పతనమని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి పివి పేరును కనీసం ఉచ్ఛరించే అర్హత కూడా లేదని కెప్టెన్ స్పష్టం చేసారు. సి ఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని మాజీ ఎంపీ కెప్టెన్ అన్నారు. తెలంగాణాలో అమలవుతున్న పథకాలు, 24 గంటల విద్యుత్తు, రైతు బందు, రైతు బీమా కాంగ్రెస్ బీజేపీ పాలిట రాష్ట్రాల్లో ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తెలంగాణాలో జయకేతనం ఎగురవేస్తుందని, హుస్నాబాద్ లో సతీష్ కుమార్ భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నారని, మరోసారి సి ఎం గా కేసీఆర్ పగ్గాలు చేపడతారని అయన జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ బాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ సుద్దాల చంద్రయ్య మాజీ మార్కెట్ చైర్మన్ లింగాల సాయిలు తదితరులు పాల్గొన్నారు.