– ఆర్బీఐ రిపోర్టు సీఎం రేవంత్‌కు చెంపపెట్టు : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు
నవతెలంగాణ-సిద్దిపేట
తాము ఇచ్చిన హామీలను అమలు చేయలేక, రాష్ట్రం అప్పుల పాలైందని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తున్నదని, తెలంగాణ దివాళా తీసిన రాష్ట్రం కాదని, దివ్యంగా వెలుగుతున్న రాష్ట్రమని ఆర్‌బీఐ రిపోర్టు తేల్చి చెప్పిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. గురువారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అబద్దాల పునాదులపై ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం అవే అబద్ధాలను ప్రచారం చేస్తూ కాలం గడుపుతున్నదన్నారు. నిజాన్ని అబద్దంగా మార్చేందుకు కాంగ్రెస్ గ్లోబల్స్ ప్రచారం చేసిందన్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదికతో పదేండ్ల తెలంగాణ అభివృద్ధి, ఆర్థిక వృద్ధిపై కాంగ్రెస్ మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నది దుష్ప్రచారమేనని తేలిపోయిందన్నారు. కేసీఆర్ సంపదను సృష్టించి పేదలకు పంచారన్నారు. పదేండ్ల పాలనలో కేసీఆర్ ప్రతి రంగాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారని ఆర్బీఐ విడుదల చేసిన హ్యాండ్‌బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్-2024 నివేదికలోని గణాంకాలు కండ్లకు కట్టినట్టు చెప్తున్నాయని తెలిపారు. పదేండ్ల్ల కేసీఆర్ పాలనలో జీఎస్డీపీ, తలసరి ఆదాయం, విద్యుత్తు, సాగు విస్తీర్ణం, వ్యవసాయం, అటవీ విస్తీర్ణం, మూలధన వ్యయం, ఉపాధి అవకాశాలు ఇలా అన్నింటా తెలంగాణ రికార్డు సృష్టించిందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణ అప్పుల కుప్ప అని రాష్ట్ర పరపతిని, పరువును దిగజార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ మొత్తం అప్పులు రూ. 7 లక్షల కోట్లకు చేరాయన్న రేవంత్ ప్రభుత్వ ప్రకటన వాస్తవదూరమని రుజువైందన్నారు. 2014-15లో తెలంగాణ మొత్తం రుణాలు రూ. 72,658 కోట్లు ఉండగా, 2024 మార్చి నాటికి ఈ రుణాల మొత్తం రూ. 3,22,499.20 కోట్లకు చేరినట్టు ఆర్బీఐ వెల్లడించిందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిమే ఈ అప్పు చేసినట్టు తెలిపారు. తెలంగాణ రాక ముందు రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉందో ఆర్బీఐ కళ్ళు తెరిపించేలా చెప్పిందన్నారు.
దేవాలయాలను కట్టడానికి రూ. 2,800 కోట్లు, రైతు బంధుకు రూ. 72,972 కోట్లు, రైతు బీమా రూ. 6,800 కోట్లు, రైతు రుణమాఫీ రూ. 29 వేల కోట్లు, ఉచిత కరెంట్‌కు రూ. 61వేల కోట్లు, గొర్రెల పంపిణీకి రూ. 5 వేల కోట్లు, ఆసరా పింఛన్లకు రూ. 61 వేల కోట్లు కేటాయించినట్టు చెప్పారు. అలాగే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం, పటిష్టమైన భద్రత కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, వెయ్యికి పైగా గురుకులాలు బీఆర్‌ఎస్ పాలనలోనే ఏర్పడ్డాయన్నారు. ఇకనైనా కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్రంపై దుష్ప్రచారాలు మానుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో నాయకులు రాజనర్సు, సంపత్ రెడ్డి, మోయిజ్, గుండు భూపేష్ తదితరులు పాల్గొన్నారు.