కాంగ్రెస్‌ పాలన రావాలి..మన బతుకులు మారాలి

– ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ అభ్యర్థి వీర్లపల్లి శంకర్‌
నవతెలంగాణ-షాద్‌నగర్‌
తెలంగాణ ప్రజల 60 ఏండ్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నెరవేరుస్తూ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని ఇచ్చిందని ఉద్యమ నేతగా కేసీఆర్‌ను నమ్మి రెండు పర్యాయాలు అధికారం ఇస్తే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి తన కుటుంబ ఆస్తులను పెంచుకున్నాడని షాద్‌నగర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి వీర్లపల్లి శంకర్‌ మండిపడ్డారు. ఆదివారం ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీ స్కీంలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం చిల్కమర్రి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాడని తెలంగాణ ప్రజల ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను నిర్వీర్యం చేస్తున్నాడని, రాష్ట్రంలో ఆదాయ వనరులను దోచుకుని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పాలనలో ప్రతి ఒక్కరికి ఇండ్లు, రేషన్‌ కార్డులు, ఉచిత కరెంటు, నిత్యావసరాల సరుకులు ప్రతి ఇంటికి సంక్షేమం అందించినట్టు గుర్తు చేశారు. నేడు కేసీఆర్‌ పాలనలలో అన్ని వర్గాల ప్రజలు అసంతప్తితో ఉన్నారని విమర్శించారు. నిరుపేదలకు ఇండ్లు ఇయ్యలేదని రేషన్‌ కార్డు ఇవ్వలేదని పింఛన్‌ ఇవ్వలేదని మండిపడ్డారు. రైతులను మహిళలను సైతం మోసం చేశాడని మండిపడ్డారు. కేసీఆర్‌ను రెండు పర్యాయాలు నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశాడని, ఇక కేసీఆర్‌ను ప్రజలు నమ్మలేరని కాంగ్రెస్‌ పాలనను కోరుకుంటున్నారని ప్రజల మద్దతుతో కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీ స్కీమ్లతో అధికారంలోకి రాబోతున్నామని అన్నారు. అధికారంలోకి రాగానే కేసీఆర్‌ అవినీతి భాగవతాన్ని బయటపెడుతామని హెచ్చరించారు.
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ యూత్‌ ప్రెసిడెంట్‌ రవీందర్‌ రెడ్డి
బీఆర్‌ఎస్‌ పార్టీ మండల యూత్‌ ప్రెసిడెంట్‌ రవీందర్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆదివారం చిలకమర్రి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని వీర్లపల్లి శంకర్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. శంకరన్న నమ్మిన వ్యక్తులకు అండగా నిలిచే వ్యక్తని కార్యకర్తల కష్టాలను తనవిగా భావించి సమస్యను పరిష్కరించే వరకు అండగా నిలిచేవాడని కొనియాడారు. నేడు కాంగ్రెస్‌ పార్టీ శంకరన్నకు మంచి అవకాశాన్ని కల్పించిందని తన గెలుపు కోసం శాయశక్తుల కషి చేస్తానని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ గాలి వీస్తోందని అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ పతనం తప్పదని అన్నారు. శంకరన్న గెలుపులో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని వివరించారు. హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో శంకరన్నను గెలిపించాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో సింగిల్‌ విండో డైరెక్టర్‌ చెన్నకేశవులు, గురువేందర్‌, శ్రీశైలం, రమేష్‌, మహేష్‌ వార్డు సభ్యులు సుగుణ ఉన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు వెంకట్రాంరెడ్డి, విశాల శ్రవణ్‌ రెడ్డి, ఎంపీటీసీలు అరుణ అంజయ్య గౌడ్‌, భార్గవ్‌ కుమార్‌ రెడ్డి, కావలి శ్రీశైలం, సర్పంచులు మధులత మోహన్‌, శివారెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ బాలరాజ్‌ గౌడ్‌, నాయకులు సత్తయ్య, అందేమోహన్‌, రాజేష్‌ గౌడ్‌, అశోక్‌, కర్ణేకోట రమేష్‌, అడివయ్య,కన్నా, రాజు, అమరెండర్‌ రెడ్డి, రాజశేఖర్‌, ప్రవీణ్‌, రమేష్‌, కండ్లపల్లి నర్సింలు, అంతారం బాలయ్య తదితరులు పాల్గొన్నారు.