ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలి

– మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ-పెద్దవంగర: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ వాగ్దానాలకు ప్రజలు మోసపోయి.. ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించారని, వచ్చే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన హాజరై, ప్రసంగించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా.. ఆరు గ్యారంటీల అమలులో విఫలమయ్యారని దుయ్యబట్టారు. నాయకులు సమన్వయంతో పని చేస్తూ, బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి సుదీర్ కుమార్ గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రైతుల వద్దకు వెళ్లి కాంగ్రెస్‌ చేస్తున్న మోసాల గురించి వివరించాలన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లోగా రూ.2లక్షల రుణమాఫీ, ధాన్యం, శనగలు, మక్కలకు రూ.500 బోనస్‌ ఇవ్వాలని, లేకుంటే రైతులు కర్రుకాల్చి వాతపెడతారన్నారు. హామీలు అమలయ్యే వరకు కాంగ్రెస్‌ పార్టీని విడిచి పెట్టమన్నారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై అన్యాయంగా, అక్రమంగా కేసులు పెడితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. రైతులు, వృద్ధులు, మహిళలు, నిరుద్యోగులను మోసం చేయడమే కాంగ్రెస్‌ పార్టీకి అలవాటుగా మారిందన్నారు. కల్యాణలక్ష్మి చెక్కులు, కేసీఆర్‌ కిట్లు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలకు అన్ని విధాల అండగా ఉంటామని చెప్పారు. మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమ నాయకులు శ్రీరామ్ మధుసూదన్ రావు తిరిగి బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్, సీనియర్ నాయకులు శ్రీరామ్ సుధీర్, దుంపల సమ్మయ్య, కనుకుంట్ల వెంకన్న, యూత్ మండల అధ్యక్షుడు కాసాని హరీష్, వేముల రఘు, శ్రీరామ్ రాము, గుగులోత్ పటేల్ నాయక్, బోనగిరి లింగమూర్తి, చిలుక బిక్షపతి, ధారావత్ రాజేందర్ నాయక్, ఎండీ ముజీబుద్దీన్, వెంకన్న, రసాల సమ్మయ్య, రెడ్యబోయిన గంగాధర్, యాకన్న తదితరులు పాల్గొన్నారు.