కాంగ్రెస్‌, బీజేపీ విష ప్రచారాలను తిప్పి కొట్టాలి

– తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్న కేంద్రం
– కాంగ్రెస్‌లో పదవుల నిరుద్యోగం
– 40, 50 సీట్లలో కాంగ్రెస్‌కు అభ్యర్థులు కరువు
– అభివృద్ధి, సంక్షేమం దేశానికి దిక్సూచి :ఆస్పత్రి భవన నిర్మాణానికి హరీశ్‌రావు శంకుస్థాపన
నవతెలంగాణ-మిర్యాలగూడ
కాంగ్రెస్‌, బీజేపీ చేస్తున్న గ్లోబల్‌ విష ప్రచారాలను తిప్పికొట్టాలని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఏరియాస్పత్రిలో శుక్రవారం వందపడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.5.80కోట్లతో నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో నిర్మించనున్న 20 ప్రాథమిక, పీహెచ్‌సీ కేంద్రాల నిర్మాణాలకు కలిపి ఎన్‌ఎస్‌పీ క్యాపు మైదానంలోనే శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్‌తో కలిసి మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుందన్నారు. ఇందుకుగాను ఢిల్లీలో అనేక అవార్డులు వచ్చాయన్నారు. ఢిల్లీలో అవార్డు ఇస్తున్నవారే గల్లీలో అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. పంచాయతీరాజ్‌, పట్టణం, అటవీ, ఆరోగ్య, విద్యుత్‌ పరిశ్రమ రంగాల్లో ఎన్నో అవార్డులు వచ్చాయని చెప్పారు. ఐటీ రంగం దేశంలో ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్‌పై విష ప్రచారం చేస్తున్నారని, వాటిని గులాబీ కార్యకర్తలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. దేశానికే తెలంగాణ దిక్సూచిగా నిలిచిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క మెడికల్‌ కాలేజీని ఆ బడా నాయకులు తీసుకురాలేదని, కానీ నేడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జగదీశ్‌ అన్న నేతృత్వంలో రెండు మెడికల్‌ కాలేజీలు మంజూరు చేశారని చెప్పారు. రాష్ట్రంలో 9 ఏండ్ల కాలంలో తొలివిడతో లక్షా 52 వేలు, రెండో దశలో 85 వేల ఉద్యోగాలు కల్పించినట్టు వివరించారు. ప్రయివేటు రంగంలో 17 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. వీటన్నింటినీ మరిచి హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీలోనే పదవుల నిరుద్యోగం ఉందని ఎద్దేవా చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉపాధి లేక అక్కడి ప్రజలు హైదరాబాద్‌కు వలస వచ్చి కడుపు నింపుకుంటున్నారని, ముందుగా తన రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తీర్చి ఆపై పక్క రాష్ట్రంపై విమర్శలు చేయాలని హితువు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40, 50 సీట్లలో అభ్యర్థులు లేరని చెప్పారు. ముమ్మాటికీ బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.మంత్రి జగదీశ్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చి దిద్దిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. తొమ్మిదేండ్ల పాలనలో ఆకలి రాజ్యాన్ని పారదోలారని చెప్పారు. దేశానికి తెలంగాణ అన్నం పెడుతుందన్నారు. కాంగ్రెస్‌ నాయకులకు నమ్మకం లేకనే ఒక్కొక్క చోట ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారన్నారు. ఉమ్మడి జిల్లాలో పెద్ద నాయకులుగా చలామణి అవుతున్న ఆ నలుగురు పదవులు అనుభవించినప్పుడు జిల్లాలో ఫ్లోరిన్‌, కరువు పెరిగిపోయిందన్నారు. నేడు రాష్ట్రంలో అవి కనుమరుగయ్యాయని, ఆ ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో 12 స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతుందన్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మెన్‌ బండ నరేందర్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్‌నాయక్‌, కంచర్ల భూపాల్‌ రెడ్డి, నోముల భగత్‌, శానంపూడి సైదిరెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, అగ్రోస్‌ చైర్మెన్‌ తిప్పన విజయసింహారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు చింత రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.