నేడు ఖమ్మంలో కాంగ్రెస్‌ తెలంగాణ జనగర్జన

– హాజరుకానున్న రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే, రేవంత్‌రెడ్డి
– మాజీ ఎంపీ పొంగులేటి సహా 50 మంది చేరిక
– నేటితో సీఎల్పీ నేత భట్టి పాదయాత్ర ముగింపు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కాంగ్రెస్‌ పార్టీ ఖమ్మంలో ఆదివారం నిర్వహించతలపెట్టిన తెలంగాణ జన గర్జన సభకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ సభకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ హాజరవుతున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీలో చేరికతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల్లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేసిన పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ మీటింగ్‌ జరుగుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు ఈ మీటింగ్‌ను శంఖారావంగా భావిస్తుండటంతో భారీఎత్తున జనసమీకరణకు కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌ వెనుక ఉన్న 100 ఎకరాల స్థలంలో మీటింగ్‌ జరగనుండగా, పక్కనే ఉన్న మరో 50 ఎకరాల్లో పార్కింగ్‌కు కేటాయించారు. లక్ష మంది కూర్చునేలా కుర్చీలు ఏర్పాటు చేస్తున్నామని, జనవరిలో బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభను మించి మీటింగ్‌ను సక్సెస్‌ చేస్తామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. రాహుల్‌ గాంధీ వస్తున్నందున నేషనల్‌ మీడియా కూడా కవర్‌ చేసే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఈ సభకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించేందుకు అధికార పార్టీ ప్రయత్నం చేస్తోందని పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంగులేటి అనుచరుల్లో ఇద్దరిని చంపుతామని హెచ్చరిస్తూ వెలువడిన పోస్టర్‌ కలకలం సృష్టించింది. దీనిని బీఆర్‌ఎస్‌ నేతలు ఖండించారు. సిపి విష్ణు ఎస్‌ వారియర్‌ సైతం దీనిపై ఒక ప్రకటన విడుదల చేశారు.తెలంగాణ జనగర్జన సభ వేదికగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. ఆయనతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్మెన్‌ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డీసీసీబీ మాజీ చైర్మెన్‌ మువ్వా విజరు బాబు, డీసీసీబీ డైరెక్టర్లు తుళ్లూరు బ్రహ్మయ్య, మేకల మల్లిబాబు, మార్క్‌ ఫెడ్‌ మాజీ వైస్‌ చైర్మెన్‌ బొర్రా రాజశేఖర్‌, వైరా మున్సిపల్‌ చైర్మెన్‌ సూతకాని జైపాల్‌ సహా పలువురు నాయకులు కాంగ్రెస్‌లో చేరబోతున్నారు.