ఎన్నికల నిబంధనల సవరణలపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: ఎన్నికల నిర్వహణా నిబంధనలు 1961కి సవరణలు చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును కాంగ్రెస్‌ పార్టీ ఆశ్రయించింది. మంగళవారం రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను పార్టీ నాయకులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ ఈ పిటిషన్‌ వేశారు. ఎన్నికల నిర్వహణా నిబంధనలు 1961లోని రూల్‌ 93లోని సబ్‌-రూల్‌ (2)ను సవరించినట్టు ఈ నెల 20న కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది. గతంలో ఈ రూల్‌ ద్వారా ఎన్నికలకు సంబంధించిన పత్రాలను ఎలాంటి మినహాయింపు లేకుండా అనుమతి ఇచ్చారు. అయితే తాజాగా ఈ రూల్‌ను ఎన్నికల పోలింగ్‌ బూత్‌ల్లో సీసీటీవీ కెమెరా ఫుటేజు, వీడియో రికార్డింగులను, ఎన్నికలకు సంబంధించిన రికార్డులను పరిశీలించేందుకు ప్రజలకు గల హక్కును నియంత్రిస్తూ ఈ సవరణలు తీసుకువచ్చారు. ఒక అభ్యర్థికి పోలింగ్‌ బూత్‌ల సీసీటీవీ కెమెరా ఫుటేజు, వీడియో రికార్డింగులను అందచేయాలని ఇటీవల పంజాబ్‌-హర్యానా హైకోర్టు ఆదేశించిన తరువాత ఈ సవరణలు చేశారు.