– ఆ పార్టీవి ఓటు బ్యాంకు రాజకీయాలు
– ఆర్‌ఆర్ ట్యాక్సే కాదు రజాకార్ ట్యాక్స్ కూడా ఉంది : ఎల్బీ స్టేడియం బహిరంగ సభలో ప్రధాని మోడీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అవినీతి పేరిట దేశాన్ని దోచుకున్న ట్రాక్ రికార్డు కాంగ్రెస్ పార్టీదని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేసి ఇక్కడ మతపర రిజర్వేషన్లు అమలు చేస్తున్నారనీ, దాన్ని దేశవ్యాప్తం చేయాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హైదరాబాద్‌లో ఆ పార్టీ బలమైన అభ్యర్థిని నిలపలేదని విమర్శించారు. అందుకే తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎంను కాదని బీజేపీని గెలిపిద్దామనే నిర్ణయానికొచ్చారన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఎంపీ అభ్యర్థులు కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, మాధవీలత, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బూరనర్సయ్య గౌడ్ గెలుపు కోరుతూ ప్రచార సభను నిర్వహించారు. దీనికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఆ సభలో మోడీ మాట్లాడుతూ..జూన్ నాలుగో తేదీన 140 కోట్ల ప్రజల సంకల్పంతో దేశం గెలువబోతున్నదన్నారు. సీఏఏ, యూసీసీ, ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాఖ్, ఆత్మనిర్భర్ భారత్ విరోధులకు ఓటమి తప్పదని స్పష్టం చేశారు. తమ పాలనలో ప్రపంచంలోనే భారత్ ఐదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందనీ, టెక్నాలజీలో ముందు వరుసలో ఉందని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో దిల్‌సుఖ్‌నగర్‌లో వరుస బాంబు పేలుళ్లు జరిగాయని గుర్తుచేశారు. ఇప్పుడు అలాంటి బాంబు పేలుళ్లు వినిపిస్తున్నాయా? వాటిని ఆపింది ఎవరు అంటూ సభికుల్ని ప్రశ్నించారు. దేశ ప్రజలంతా బీజేపీకి ఓటేసి ఆ దాడులను అడ్డుకున్నారన్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో మధ్యతరగతి సంక్షేమం గురించే లేదని విమర్శించారు. రామ మందిరం కట్టడం తప్పా? పూజ చేయడం తప్పా? అని ప్రశ్నించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో ఎంఐఎం దోస్తానా చేయడం వల్ల హైదరాబాద్‌కు ముక్తి లభించలేదన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించట్లేదనటం అవాస్తమన్నారు. తెలంగాణకు నాలుగు వందేభారత్ రైళ్లు ఇచ్చామనీ, రామగుండంలో ఫర్టిలైజర్ పరిశ్రమ, సమ్మక్క సారలమ్మ యూనివర్సిటీ ఏర్పాటు చేశామనీ, జాతీయ రహదారులను ఇచ్చామని వివరించారు. బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే కాంగ్రెస్‌కు వేసినట్టేననీ, కాంగ్రెస్‌కు వేస్తే ఓటు వృథా చేసుకున్నట్టేనని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అధిక సీట్లను గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సొల్యూషన్ సిటీ అనీ, ఇక్కడ ప్రతి సమస్యకూ పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. ఆస్తులపై వారసులకు హక్కు లేకుండా చేయాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపించారు. దేశాన్ని విదేశీ కండ్లద్దాల్లో చూసే కాంగ్రెస్‌కు ఐడియా ఆఫ్ ఇండియా అనేదానిపై కనీసం అంచనా కూడా లేదన్నారు. ఒకరు ఢిల్లీలో, మరొకరు ఇక్కడ ఉంటూ ఆర్‌ఆర్ ట్యాక్స్‌తో తెలంగాణను ఏటీఎంగా మార్చుకున్నారని విమర్శించారు. వారికి రజాకార్ ట్యాక్స్ కూడా తోడైందనీ, అది ఎలా వసూలు చేస్తారనేది పాతబస్తీకెళ్తే తెలుస్తుందని చెప్పారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..తమకు రాహుల్‌గాంధీ, కేసీఆర్ ఇచ్చే సర్టిఫికెట్లు అవసరం లేదనీ, ప్రజలిచ్చే సర్టిఫికెట్టు కావాలని చెప్పారు. అబద్దాలు, అసత్య ప్రచారాలతో కాకుండా ఇచ్చిన హామీలను ముందు పెట్టి ఓట్లు అడగాలని సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. మోడీ లేని భారతాన్ని చూడలేమన్నారు. మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్ మాట్లాడుతూ..బీజేపీ పాలిస్తున్న ఏ రాష్ట్రంలోనూ రిజర్వేషన్లు తీసేయలేదనీ, రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ అసత్య ప్రచారాలు చేస్తున్నదని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశము కూడా లేదన్నారు. రాష్ట్రంలో మళ్లీ నీటి, కరెంటు కష్టాలు మొదలయ్యాయన్నారు. చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందనీ, ఏ చిన్న అవసరానికైనా సీఎం పెద్దన్నదగ్గరకు పోయి అడగాల్సిందేనని చెప్పారు. దేశం మొత్తం మోడీ హవా నడుస్తోందన్నారు. హైదరాబాద్ అభ్యర్థి మాధవీలత మాట్లాడుతూ..త్రిపుల్ తలాఖ్ తొలగించి ముస్లిం మహిళల గౌరవం పెంచిన ఘనత మోడీదని కొనియాడారు. మోడీ ప్రభుత్వం అభివృద్ధిలో పది అడుగులు ముందుకేస్తే..కొందరు యువతను తప్పుదోవ పట్టిస్తూ వంద అడుగులు వెనక్కి లాగాలని చూస్తున్నారని ఆరోపించారు. భువనగిరి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ..మోడీ మళ్లీ ప్రధాని అవుతారనీ, రిజర్వేషన్లు, రాజ్యాంగం రద్దు కావని చెప్పారు. మోడీ అంటే త్రీడీ అన్నారు. సభలో ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డి, అధికార ప్రతినిధి సుభాశ్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.