– ఆ పార్టీ ప్రజలను మభ్యపెట్టింది : మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అమలుకు సాధ్యం కాని అనేక హామీలను ఇవ్వటం ద్వారా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. తద్వారా అది ప్రజలను మభ్యపెట్టిందని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి… ‘ఆ బరువేంటో’ దానికి తెలిసొస్తుందని ఎద్దేవా చేశారు. స్పీకర్ పదవికి నామినేషన్ల సందర్భంగా బుధవారం అసెంబ్లీకి విచ్చేసిన కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా పద్దులపై చర్చించలేదని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో పద్దులపై సమగ్ర చర్చ జరిగిందని వివరించారు. ప్రతీయేటా కాగ్ లెక్కలు ఇచ్చిందనీ, ఆడిట్ రిపోర్టులను శాసనసభకు సమర్పించామని గుర్తు చేశారు. పద్దులపై శ్వేతపత్రాలను విడుదల చేశామని తెలిపారు. రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ అప్పుల కుప్ప చేసి, తమకు అప్పగించిందంటూ కాంగ్రెస్ నేతలు చెప్పటం హాస్యాస్పదమన్నారు. గవర్నర్ ప్రసంగంలో కూడా ఇదే పాత చింతకాయ పచ్చడి చెబుతారంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో 45 వేల ఉద్యోగాలిస్తామంటూ ప్రకటించారు.. ఇది ఎలా సాధ్యమంటూ ప్రశ్నించారు. ఎవరైనా ఆర్థిక పరిస్థితిపై లెక్కలేసుకుని హామీలిస్తారా..? లేక హామీలిచ్చిన తర్వాత లెక్కలేసుకుంటారా..? అని అడిగారు. అందువల్ల కాంగ్రెస్‌కు అసలు ఆట ఇప్పటి నుంచి మొదలవుతుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్న రాహుల్ గాంధీ హామీ ఏమైంది..? తొలి మంత్రివర్గంలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధతన్న వాగ్దానం ఎక్కడ..? అంటూ ఆయన ప్రశ్నించారు.