– తెలంగాణ ఇచ్చి వెనక్కి తీసుకోవడమే నిదర్శనం..
– తెలంగాణలో కేసీఆర్ చేతిలో పెడితే ఇక్కడే నిర్ణయాలు
– కాంగ్రెస్ వస్తే ఢిల్లీ చేతిలో కీలుబొమ్మలు
– రేషన్‌కార్డుల్లో గల్ఫ్‌కు వెళ్లిన వారి పేర్లు కొనసాగేలా చూస్తాం
– కమ్మర్‌పల్లి మండలంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం
నవతెలంగాణ- కమ్మర్ పల్లి: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారు మాట మీద నిలబడే రకం కాదని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి, బీఆరెస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణను ఇచ్చి వెనక్కి తీసుకున్న ఆ పార్టీ గత చరిత్రే దీనికి నిదర్శనమని గుర్తు చేశారు. మంగళవారం బాల్కొండ నియోజకవర్గం కమ్మర్‌పల్లి మండలంలోని కోనాపూర్, కేసీ తాండా, కోనా సముందర్‌లలో ఆయన రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేశ్‌రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ 24 గంటల్లోపే యూ టర్న్ తీసుకోవడంతో ఎందరో ఉద్యమకారులు అమరులయ్యారన్నారు. అంత పెద్ద నిర్ణయాన్నే గంటల్లో వెనక్కి తీసుకున్న కాంగ్రెస్ చిన్న చిన్న విషయాలపై స్థిరమైన వైఖరిని కొనసాగించబోదన్నారు. కొత్త బీడీ పీఎఫ్ వచ్చిన వారికి పింఛన్లు మంజూరు కావాలంటే ఇక్కడ కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే సరిపోతుందన్నారు. అదే కాంగ్రెస్ వస్తే కొత్త బీడీ పీఎఫ్ పించన్ల మీద ఢిల్లీలో సోనియాగాంధీ నిర్ణయం తీసుకుంటే గానీ ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఏమీ చేయలేరన్నారు. ఆలోచించి ఓటు వేస్తేనే రాజకీయాలకు విలువ ఉంటుందన్నారు. పనిచేసే వారికి ఓటు వేస్తే విలువైన రాజకీయాలు ప్రజలకు అందుతాయన్నారు. తాను సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా విన్నవించి సంఘ భవనాలకు మంజూరు చేయించిన ప్రొసీడింగులను పనికి రానివని మాట్లాడుతున్న వ్యక్తి సన్యాసి అని విమర్శించారు. ఆ మంజూరు పత్రాలతో ఇప్పటికిప్పుడు కూడా నిర్మాణపనులు ప్రారంభించుకోవచ్చన్నారు. గల్ప్‌కు వెళ్లిన వారి పేర్లు రేషన్‌కార్డుల్లోంచి తొలగించి మూలంగా ఆ కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించామన్నారు.గల్ప్‌కు వెళ్లిన వారు అక్కడ పని దొరికితే ఉన్నట్టు లేదంటే తిరిగిరావడమే లాంటి పరిస్తితులను గమనించి ఇక మీదట రేషన్‌కార్డుల్లోంచి వారి పేర్లను తొలగించే నిబంధనను ఎత్తివేసే ఆలోచన చేస్తున్నామన్నారు. కరెంటు కేసీఆర్, తాను రాకముందు ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉందో ప్రజల అనుభవంలోనే ఉందన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోవడం, మరమ్మతు ఖర్చులకు డబ్బులు వసూలు చేయడం ఇప్పుడు లేవన్నారు. కరెంటు గతంలో ఎట్లా నాట్యం చేస్తే అట్ల నాట్యం ఆడే పరిస్థితి ఉండేదన్నారు. విపక్షాల నాయకులు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. చెప్పుకోవడానికి వారు చేసిన అభివృద్ధి ఏమీ లేకనే తనపై అసత్య ఆరోపణలకు దిగు తున్నారని విమర్శించారు. తన దగ్గరికి వచ్చిన వారికి కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తానే కానీ.. రూపాయి లంచం అడిగిన చరిత్ర తనది కాదన్నారు. ప్రజలకు సైతం తనపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. గట్టుపొడిచిన వాగు కాలువ నీటిని ఎటువంటి ఇబ్బంది లేకుండా అందించే కృషి చేస్తానన్నారు. రెండు గ్రామాల్లో ప్రజలు కోరిన పలు సమస్యలను తప్పుకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ…
ప్రజలకు కావాల్సిన ఎంత పెద్ద పని అయినా సరే చేసే పెట్టే సత్తా ప్రశాంత్ రెడ్డికి ఉందన్నారు.హైదరాబాద్‌లో ఉండే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, ఇక్కడే వేల్పూర్‌లో ఉండే మంత్రి ప్రశాంత్‌రెడ్డిని వదులుకొని ఢిల్లీ పార్టీలను తెచ్చుకుంటే తీవ్రంగా నష్టపోతామన్నారు. రాష్ట్రం బాగుకోసం బలంగా నిలబడే నాయకులు వీరు అని అన్నారు. తెలంగాణ సరిహద్దుల్లో సైనికుడిగా ఉన్న కేసీయారే శ్రీరామ రక్ష అన్నారు. ఈ మధ్య హైదరాబాద్ వచ్చిన మాజీ హోం మంత్రి చిదంబరం ఉద్యమ సమయంలో తెలంగాణ ఏర్పాటు పై కాంగ్రెస్ పార్టీ యూ టర్న్ తీసుకోవడం వల్ల ఎందరో విద్యార్థులు, యువకులు బలిదానాలు చేసుకోవాల్సి వచ్చినందుకు క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు. మంత్రికి ఆయా గ్రామాల్లో ఘన స్వాగతం లభించింది. కోన సముందర్‌లో మాదిగ దండోరా యువత సభ్యులు ఘన స్వాగతం పలికారు. మహిళలు బోనాలతో తరలి వచ్చి మంత్రి ఘనంగా స్వాగతం పలికారు.