కాంగ్రెస్‌దే గెలుపు

కాంగ్రెస్‌దే గెలుపు– ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం
– ఓటమి అంచున ఉంటే కేసీఆర్‌ స్థానాలు మారుస్తారు : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-కామారెడ్డి
ఎప్పుడైతే ఆ స్థానంలో ఓడిపోతానని కేసీఆర్‌కు తెలుస్తుందో అప్పుడే స్థానాలు మారుస్తాడని, కాంగ్రెస్‌ గెలుపు ఖాయమని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పోలింగ్‌ ముగిసిన తర్వాత నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే నెల 9న కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తుం దన్నారు. కేసీఆర్‌ను కామారెడ్డిలో ఓడిస్తున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఓటమి అంచున ఉన్నప్పుడల్లా కేసీఆర్‌ స్థానాలు మారుస్తాడని గుర్తు చేశారు. అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేసినా వారిని ప్రజలు ఓడించారన్నారు. శ్రీకాంతాచారి ఆత్మకు ప్రగాఢ నివాళులర్పిస్తున్నట్టు ప్రకటించారు. శ్రీకాంతాచారి డిసెంబర్‌ 3న తుది శ్వాస వదిలాడని, ఆరోజే ఎన్నికల ఫలితాలు రానున్నాయని తెలిపారు.
సమాజంలోని చైతన్యంపై మాకు పూర్తి నమ్మకం ఉందని, ఎవరెన్ని రకాలుగా కుట్రలు చేసినా వెనుకడుగు వేయకుండా పోరాడామన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఏవీ కాంగ్రెస్‌కు అధికారం రాదని చెప్పడం లేదని కొన్ని స్థానాలు మారుతున్నాయని మాత్రమే చెబుతున్నాయన్నారు. ఫలితాలు తమకు అనుకూలంగా లేవనే కేసీఆర్‌ మీడియా ముందుకు రాలేదన్నారు. ఇవాళ చంద్రుడికి మబ్బులు పట్టాయి అన్నారు. ”ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పు అంటున్నావ్‌ కదా ఒకవేళ అవి నిజమైతే నువ్వు ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్తావా” అని కేటీఆర్‌కు సవాల్‌ విసిరారు. మీడియాకు ఈ రోజు నుంచి స్వేచ్ఛ లభిస్తుందన్నారు. తాము పాలకులం కాదు సేవకులమని తెలిపారు. 4 కోట్ల మంది ప్రజలు మనకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చారన్నారు. మనకు మొదటి, చివరి శత్రువు కేసీఆర్‌ కుటుంబంలోని ఆ నలుగురేనని అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి 25 సీట్లు దాటబోవన్నారు. సమావేశంలో మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస శ్రీనివాసరావు, వేణుగోపాల్‌ రెడ్డి, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌, గూడెం శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.