కొడతామంటే కాంగ్రెస్‌ కార్యకర్తలు చేతులు ముడుచుకోరు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ నాయకులు బట్టలూడదీసి కొడతామంటే కాంగ్రెస్‌ కార్యకర్తలు చేతులు ముడుచుకొని లేరని, వారు కన్నెర్ర చేస్తే రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అలియాస్‌ బీఆర్‌ఎస్‌ మిగలదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హెచ్చరించారు. గురువారం హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బూత్‌ లెవెల్‌ కన్వీనర్ల శిక్షణా శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను ప్రజాస్వామ్యయుతంగా గౌరవించాలనే ఆలోచనతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదనీ, దీనిని చేతగాని తనంగా భావిస్తే తమ తడాఖా ఏంటో కూడా చూపిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్‌ ప్రకటించిన 6 గ్యారంటీల అమలు, ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వం తెస్తామన్న వాగ్ధానాన్ని నమ్మిన ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. ఇప్పటికే రెండు గ్యారంటీలను అమల్లోకి తెచ్చామనీ, మిగిలిన వాటి అమలు కోసం కసరత్తు జరుగుతోందని చెప్పారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీకి వ్యతిరేకంగా మతసామరస్యాన్ని కాపాడేందుకు యాత్రలు చేస్తున్న రాహుల్‌ గాంధీకి 15 సీట్లు గెలిపించి కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కష్టపడిన కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ దేశాన్ని పాలించే అర్హత, శక్తి కాంగ్రెస్‌ పార్టీకే తప్ప మరే ఇతర పార్టీలకు లేవన్న సందేశాన్ని కాంగ్రెస్‌ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.