– పదేండ్లలో బీఆర్‌ఎస్ అప్పు రూ.4.17లక్షల కోట్లు
– తప్పని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం : బీఆర్‌ఎస్ సభ్యులు హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పదేండ్లలో బీఆర్‌ఎస్ రూ.4.17లక్షల కోట్ల అప్పు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సంవత్సరమే రూ.1.25 లక్షల కోట్ల అప్పు చేసిందని బీఆర్‌ఎస్ సభ్యులు హరీశ్‌రావు ఆరోపించారు. తాను చెప్పింది తప్పని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. రాష్ట్ర రుణాలపై శాసనసభలో జరిగిన చర్చలో హరీశ్‌రావు మాట్లాడారు. ప్రివిలేజ్ మోషన్‌పై గురువారం అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఇదే తీరున కాంగ్రెస్ సర్కార్ అప్పులు చేస్తే ఐదేండ్లలోనే గత ప్రభుత్వ అప్పును మించిపోతారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేండ్లలో రూ.4.17లక్షల కోట్లు అప్పు చేస్తే, వీళ్ల అప్పు ఐదేండ్లలోనే రూ.7 లక్షల కోట్లు దాటిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.. రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం పరంగా చూసినా తాము మిగులు బడ్జెట్ రాష్ట్రాన్నే అప్పగించామని అన్నారు. భూములు కుదువపెట్టి అప్పులు తీసుకునేందుకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. రూ.75 కోట్లకు ఎకరం చొప్పున టీజీఐఐసీ భూములు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వాస్తవాలు ఇలా ఉంటే మాటి మాటికి గత సర్కార్ అప్పులంటూ రాష్ట్ర ప్రభుత్వం, సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. తాను మాట్లాడిన మాటలు తప్పయితే స్పీకర్ ఫార్మట్ రాజీనామా చేస్తాననీ, అందుకు భట్టి సిద్దమేనా అంటూ సవాల్ విసిరారు.