
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో 2025-26 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజావ్యతిరేక బడ్జెటని ఈ బడ్జెట్ కు వ్యతిరేకంగా ఈ నెల 10న హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “మహా ధర్నా” లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. శుక్రవారం భువనగిరి మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద హైదరాబాదులో జరిగే “మహాధర్నా” ను జయప్రదం చేయాలని ప్రజా సంఘాల బాధ్యులతో కలిసి ” కరపత్రం ” ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ ప్రజల జీవితాలకు, శ్రామిక ప్రజల బతుకుదెరువుకు శాపంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇంత మొండిగా బరితెగించి ప్రజావ్యతిరేక విధానాలను అమలు జరుపుతున్న నేపథ్యంలో రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు, శ్రామికులు, ఇతర ప్రజానీకం ఐక్యంగా పోరాటాలు నిర్వహించటం తప్ప మరో మార్గం లేదన్నారు. సరళీకృత ఆర్థిక విధానాలను వేగంగా అమలు చేసేందుకు ఊతమిచ్చేలా బడ్జెట్ రూపకల్పన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థూల జాతీయోత్పత్తి అంచనాలు భిన్నంగా పడిపోయాయని చెప్పారు. దీనికి కారణం ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమే నన్నారు. ఈ కాలంలో నిత్యజీవితావసరాల సరుకులను సాధారణ ప్రజలు పెద్దగా కొనుగోలు చేయలేదన్నారు. ఉద్యోగుల, కార్మికుల వేతనాలు పెరగకపోవటమే ఇందుకు కారణమని తెలిపారు. కాని ధరలు విపరీతంగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందులో ఆహార సరుకుల ధరలు మరింత గా పెరిగాయని గుర్తు చేశారు. ఇది కష్టజీవుల జీవితాలను అతలాకుతలం చేసిన చర్య తప్ప మరేమిటని ప్రశ్నించారు. ఉపాధి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో ఉపాధి కల్పన, కార్మిక భద్రతకు సంబంధించిన అంశాలు ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించకపోవడం అన్యాయమన్నారు. విభజన హామీ చట్టంలోని అంశాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ పదేండ్ల తర్వాత కూడా పరిష్కరించే చర్యలు తీసుకోకపోవడం మోసం కాక మరేమిటని ప్రశ్నించారు. వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత అని చెప్పి బడ్జెట్ కేటాయింపులు ప్రకటించకుండా రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి మోసగించిందని విమర్శించారు. బీమా రంగంలో ఎఫ్‌డీఐలను 74 శాతం నుంచి 100 శాతం పెంచడం జాతీయ బీమా సంస్థలను బలహీనం చేయడమేనని చెప్పారు. ఆర్ధిక సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకే కేంద్రం సహకరిస్తామని బడ్జెట్‌లో ప్రకటించడం ఫెడరల్ స్ఫూర్తికి విఘాతమన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలని అందులో భాగంగా హైదరాబాదులో జరిగే మహాధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పల్లెర్ల అంజయ్య, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గునుగుంట్ల శ్రీనివాస్, ఐలు జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ బొల్లెపల్లి కుమార్, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్లాపురం వెంకటేష్, తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు ఏదునూరి మల్లేశం, ఎస్ఎఫ్ఐ మాజీ డివిజన్ కార్యదర్శి ఏదునూరి వెంకటేష్, డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు మైలారం శివ, జిఎంపిఎస్ మండల నాయకులు కడారి కృష్ణ, వివిధ ప్రజా సంఘాల నాయకులు గంగనబోయిన బాల్ నరసింహ, గంగనబోయిన పాండు, చేగూరి రాజు, ఎదునూరి సత్తయ్య, శ్రీరాం నర్సింహ, పన్నాల దయాకర్ రెడ్డి, పన్నాల మోహన్ రెడ్డి, ఆకుల శంకరయ్య, గోగు బాల నరసింహ, గోగు అయిలయ్య, కొక్కల బిక్షపతి లు పాల్గొన్నారు.