ఈనెల 10న ఇంద్రపార్క్ దగ్గర నిర్వహిస్తున్న మహా ధర్నాను జయప్రదం చేయండి..

– తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పల్లెర్ల అంజయ్య …
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
కేంద్ర బడ్జెట్లో జాతీయ గ్రామీణ ఉపాధి చట్టానికి రెండు లక్షల కోట్ల రూపాయలు కేటాయించాలని, అన్ని వర్గాల అభివృద్ధికి సరైన నిధులు కేటాయించాలని ఈ నెల 10న హైదరాబాదులోని ఇంద్ర పార్క్ వద్ద నిర్వహిస్తున్న మహాధర్నాలో వ్యవసాయ కూలీలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికులు, కార్మికులు కర్షకులు, వృత్తిదారులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పల్లెర్ల అంజయ్య పిలుపునిచ్చారు. గురువారం భువనగిరి మండల పరిధిలోని నందనం గ్రామంలో వ్యవసాయ కూలీల స్థితిగతులను అధ్యయనం చేస్తూ, సంఘ సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంజయ్య పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గిస్తు పథకాన్ని ఎత్తివేయాలని కుట్రను చేస్తుందని విమర్శించారు. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో 2 లక్షల కోట్లు రూపాయలు కేటాయించవలసిన గ్రామీణ ఉపాధి చట్టానికి కేవలం 86 వేల కోట్ల రూపాయలు కేటాయించడం చాలా దారణమని అన్నారు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీకి, సామాజిక అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ను పరిశీలిస్తే సంపన్నుల కోసమే అన్నట్టుగా ఉంది తప్ప పేదలకు ఓరగపెట్టింది ఏమీ లేదని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, వ్యవసాయ కార్మికులు, అసంఘటిత కార్మికులకు, దళితులకు, గిరిజనులకు, మైనార్టీలకు, ఓబీసీలకు, మహిళలకు తగిన నిధులు కేటాయిస్తే వారు అభివృద్ధి చెందితేనే ఈ దేశం ముందుకు పోతుందని దానిని బిజెపి విస్మరించి బడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు నిధులు కేటాయిస్తూ ఊడిగం చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అన్ని వర్గాల ప్రజలు తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు బిజెపి ప్రవేశపెట్టిన బడ్జెట్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారని అందులో భాగంగానే ఈ నెల 10న వేలాది మందితో హైదరాబాదులో మహా ధర్నా నిర్వహిస్తున్నామని ఈ ధర్నాకు ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు కొండపురం యాదగిరి, మండల నాయకులకు కే . ఆంద్రయ్య , కే. నర్సింహ, కే. స్వామి, కే. పెద్దమ్మ, కే. సునంద, కే  మైసమ్మ, పి రేణుక, ఎన్. లక్ష్మమ్మ, కే. చంద్రమ్మ, వై. సావిత్రి, ఎన్. సంతోష లు పాల్గొన్నారు.