నవతెలంగాణ – డిచ్ పల్లి
ఈ నెల జనవరి 28 న ఖమ్మం లో జరిగే రెండు పి.డి.ఎస్.యూ రాష్ట్ర కార్యవర్గ ఐక్యత సభను జయప్రదం చేయాలని తెలంగాణ యూనివర్సిటీ పి.డి.ఎస్. యూ నాయకుడు అక్షయ్ విద్యార్థి లోకాన్ని కోరారు. సోమవారం తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు ఐక్యత కరపత్రాలను పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడి ఎస్ యూ ఉస్మానియా యూనివర్సిటీలో పురుడోసుకొని నేడు దేశవ్యాప్తంగా పీడిత విద్యార్థుల పక్షాన పోరాడుతుందని వివరించారు.గత 50 సంవత్సరాల సుదీర్ఘ పోరాట వారసత్వం పి డి ఎస్ యూ సొంతమన్నారు. రాజ్యం పాలక ప్రభుత్వాలు ఎంతటి నిర్బంధం ప్రయోగించినా ఎప్పటి కప్పుడు వాటికి సవాలు విసురుతు తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటుందన్నారు. దేశ విప్లవ విద్యార్థి ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిందని, జార్జిరెడ్డి త్యాగం, జంపాల చంద్రశేఖర ప్రసాద్ అమరత్వం అమరవీరుల అంకితభావం అశేషమైన పీడిత విద్యార్థి లోకాన్ని నేటికీ కదిలిస్తూనే ఉందని వాపోయారు. వీరి ఆశయ సాధనలో నిన్నటి వరకు విడివిడిగా కొనసాగిన రెండు పి డి ఎస్ యూ సంస్థలు నేడు ఐక్యమవ్వడాన్ని అనేకమంది ప్రగతిశీల విద్యార్థి అభిమానులు, విద్యావేత్తలు, మేధావులు,విద్యార్థులు హర్షిస్తున్నారని తెలిపారు. ఈ కలయిక పటిష్టమైన విప్లవ విద్యార్థి ఉద్యమానికి తోడ్పాటునందిస్తుందని ప్రకటిస్తున్నామన్నారు.పిడిఎస్ యూ తెలుగు నేల పైన అనేక ప్రతికూలమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ధైర్యంగా నిలబడుతూ ఢిల్లీ, పశ్చిమబెంగాల్, ఒడిస్సా, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, అస్సాం తదితర రాష్ట్రాలకు విస్తరించి తన కార్యచరణను మొదలుపెట్టిందని, దేశ విప్లవ విద్యార్థి ఉద్యమంలో ఇదొక చారిత్రాత్మకమైన పరిణామమని పేర్కొన్నారు. ప్రగతిశీల విద్యార్థుల ఐక్యత నేడు అనివార్యంగా ముందుకోస్తుందని, ఈ చారిత్రక సందర్భంలో రెండు విప్లవ విద్యార్థి స్రవంతులు ఐక్యమవుతున్నాయని వివరించారు. దీని వరకే పరిమితం కాకుండా దేశంలో ఉన్న మరిన్ని విప్లవ విద్యార్థి సంఘాలతో భవిష్యత్తులో ఐక్యమవ్వడానికి ప్రయత్నిస్తుందని, దీని ద్వారా మరింత బలమైన విద్యార్థి ఉద్యమాన్ని నిర్మిస్తుందని అన్నారు .సమరశీల పోరాటాలు, ఈ ఐక్యతను విద్యార్థులు, మేధావులు, విద్యావేత్తలు అన్ని వర్గాల ప్రజలు సాదరంగా ఆహ్వానించి జనవరి 28 ఖమ్మంలో జరిగే ఐక్యత సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తే.యూ పి.డి.ఎస్.యూ నాయకులు దేవిక, బిందు, నిఖిల్, రాజేందర్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.