ఉక్రెయిన్‌ లో పెరిగిన నిర్బంధ సైనిక నియామకాలు – న్యూయార్క్‌ టైమ్స్‌

న‌వ‌తెలంగాణ – ఉక్రెయిన్‌
ఉక్రెయిన్‌ లో రోడ్ల మీద తిరిగే పురుషులను పట్టుకుని బలవంతం గా సైన్యంలో చేర్చి యుద్ధరంగానికి పంపటం జరుగుతుందని న్యూయార్క్‌ టైమ్స్‌ రాసింది. యుద్ధంలో సైనికుల మరణాలు విపరీతంగా పెరగటంవల్ల ఎవరిని బడితే వారిని సైన్యంలో బలవంతంగా చేర్చటం జరుగుతోంది. ఇటువంటి స్థితిలో సైన్యంలో బలవంతంగా చేరేవారి మానసిక స్థితిని కూడా పట్టించుకోవటంలేదని న్యూయార్క్‌ టైమ్స్‌ రిపోర్ట్‌ చేసింది. అయితే ఉక్రెయిన్‌ లో జరుగుతున్న యుద్ధాన్ని పశ్చిమ దేశాల మీడియా రిపోర్ట్‌ చేసే తీరులో వచ్చిన గణనీయమైన మార్పు తరువాతే న్యూయార్క్‌ టైమ్స్‌ ఇలా రాయటం జరిగింది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాడీమీర్‌ జెలెన్‌ స్కీ రష్యాను ఓడించగలననే పగటి కలలు కంటున్నాడని, గత వేసవిలో సరియైన వ్యూహంలేకనే ఉక్రెయిన్‌ చేసిన ప్రతిదాడి ఘోరంగా విఫలమైనదనే ధోరణిలో పశ్చిమ దేశాల మీడియా ఉక్రెయిన్‌ యుద్ధంపైన రిపోర్ట్‌ చేస్తోంది. తమ సైన్యంలోని మరణాల సంఖ్యను ఉక్రెయిన్‌ పేర్కొనకపోయినప్పటికీ అమెరికా అంచనా ప్రకారం గత రెండేళ్ళలో 150, 000మంది ఉక్రెయిన్‌ సైనికులు యుద్ధంలో చనిపోయారు. వ్లాడీమీర్‌ జెలెన్‌ స్కీ మాజీ సలహాదారు అలెక్సే అరెస్టోవిచ్‌ అంచనాలో ఈ సంఖ్య 300,000ల దాకా ఉంది. జూన్‌ నుంచి నవంబర్‌ మధ్యకాలంలోనే 125,000మంది ఉక్రెయిన్‌ సైనికులు చనిపోయారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. అంతటి స్థాయిలో ఉక్రెయిన్‌ తన సైనికులను కోల్పోవటంవల్ల, లక్షలాది ఉక్రెయిన్‌ ప్రజలు దేశం విడిచి పారిపోవటంవల్ల ఉక్రెయిన్‌ సైన్యంలో బలవంతపు చేరికలు జరుగుతున్నాయి.