నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఈ నెలాఖరులోపు ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలనపై సోమవారం ఆమె సంబంధిత జిల్లా, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం లబ్ధిదారుల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని, నల్గొండ జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో 3 లక్షల, 60 వేల, 205 దరఖాస్తులు, పట్టణ ప్రాంతంలో 71626, మొత్తం 4,31,831 దరఖాస్తులు రావడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ దరఖాస్తులన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ఇందిరమ్మ ఇండ్ల ఇన్స్పెక్షన్ మొబైల్ యాప్ ద్వారా గ్రామ పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శిలు, మున్సిపాలిటీలలో వార్డు అధికారులు పరిశీలించాలని చెప్పారు. పంచాయతీ కార్యదర్శి,వార్డ్ అధికారులు లేనిచోట టీఎ లేదా ఇతర నియమించిన అధికారులు దరఖాస్తులను పరిశీలించాలని చెప్పారు. జిల్లాలోని 844 గ్రామపంచాయతీలు, 182 వార్డు పరిధిలలో పంచాయతీ సెక్రటరీలు, వార్డ్ ఆఫీసర్లు ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన కార్యక్రమాన్ని నెలాఖరులోపు పూర్తిచేయాలని చెప్పారు. ఇండ్ల దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని, ఇందిరమ్మ కమిటీలు సైతం పంచాయతీ కార్యదర్శులతో ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలనను పరిశీలించవచ్చని తెలిపారు. దరఖాస్తుదారు బిపిఎల్ వర్గం , ప్రస్తుత నివాస గృహానికి సంబంధించిన పూర్తి వివరాలు, కులం,చిరునామా, అన్ని వివరాలతో పాటు, ప్రస్తుతం ఉన్న ఇంటి దగ్గర తీసుకున్న ఫోటో, ఇంటి పరిస్థితిపై లోపల,బయట ఫోటోలు,అలాగే కొత్తగా నిర్మించటలపెట్టిన స్థలం, దానికి సంబంధించిన పూర్తి వివరాలను మొబైల్ యాప్ లో అప్లోడ్ చేయాలని చెప్పారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ కు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, గృహ నిర్మాణ శాఖ పిడి రాజకుమార్, జెడ్పి సి ఓ ప్రేమ్ కరణ్ రెడ్డి , ఈ డి ఎం దుర్గా రావ్, ఆర్డీవోలు,మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులు, సర్వేయర్లు, తదితరులు హాజరయ్యారు.