ఏకీకృత పెన్షన్‌- మరో అసంపూర్ణ పథకం!

Consolidated Pension- Another incomplete scheme!యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీం(యుపిఎస్‌) అనే పేరున కొత్త పెన్షన్‌ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఎంతో అట్టహాసంగా రెండు దశాబ్దాల క్రితం ప్రారంభించబడిన నూతనపెన్షన్‌ విధానం (ఎన్పీఎస్‌) అత్యంత లోపభూయిష్టం, నిష్ప్ర యోజనకరమైనదని కేంద్ర ప్రభుత్వం బహిరంగంగా అంగీకరించినట్లయింది. ప్రకటించ బడిన యుపిఎస్‌ స్కీం మెరుగైనదే తప్పా ఓపిఎస్‌కు సరితూగేది కాదు. కాంట్రిబ్యూషన్లతో సంబంధం లేకుండా పెన్షన్‌ కావాలని డిమాండ్‌ చేస్తే కాంట్రిబ్యూషన్లు తప్పనిసరి చేస్తూ, ఆ కాంట్రిబ్యూషన్‌లలో కేవలం చివరి ఐదునెలల జీతం మాత్రమే చెల్లించే పద్ధతి ప్రకటించింది.అదే ఎన్పీఎస్‌లో మొత్తం కాంట్రిబ్యూషన్లలో అరవైశాతం పదవీ విరమణ సందర్భంగా విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. యుపిఎస్‌ ప్రకటనతో ఎన్పీఎస్‌ సరైనది కాదని మాత్రం దేశం అంగీకరించినట్లయింది. గత ఇరవైయేండ్లుగా దేశవ్యాప్తంగా అనేక డిపార్ట్‌మెంట్లు, రంగాల్లోని సంఘాలు, వీటికి తోడు కేంద్ర కార్మిక సంఘాలు, ఇండిపెండెంట్‌ ఫెడరేషన్లు కొన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా వామపక్ష పార్టీలు,వాటి అనుబంధ సంఘాలు ఈ అంశంపై నిర్విరామంగా చేస్తున్న పోరాట ఫలితమిది. దీనిపై నిర్విరామ పోరాటం చేసిన ప్రతిఒక్కరూ అభినందనీయులే. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో గతేడాది జాయింట్‌ ఫోరం ఫర్‌ రెస్టోరేషన్‌ ఆఫ్‌ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ అనే పేరు మీద జిల్లాల వారీగా సెమినార్లు రాష్ట్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించి అనేకమంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులను కదిలించి ప్రభుత్వాలు గుర్తించేలా చేసిన ప్రయత్నం గొప్పది. ఇందులో కూడా స్థానిక ఆల్‌ ఇండియా ఇన్సురెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఎఐఐ ఇఏ) క్యాడర్‌, సభ్యులు తీవ్రంగా కృషి చేశారు. ఎన్పీఎస్‌ను బీజేపీ అనుబంధ సంఘమైన బీఎంఎస్‌ లాంటి సంఘం ఏనా డూ వ్యతిరేకించలేదు. దాని స్థానంలో కొత్త పథకాన్నీ కోరలేదు. అసలు తమ వైఖరేంటో కూడా చెప్పలేదు. కానీ ఇప్పుడు సంబ రాలకు సిద్ధమవడం హాస్యాస్పదం. ఎంతోమంది కార్మికులు, ఉద్యోగులు, ఏండ్లుగా చేసిన పోరాటాల త్యాగ ఫలితమిది.
అయితే ఎన్పీఎస్‌ మంచిది కాదని అంగీకరించినప్పుడు ఎంతోఆదరణ పొందిన ఓపిఎస్‌ను పునరుద్ధరించకుండా మళ్లీ కొత్తపేరుతో యుపిఎస్‌ను తీసుకురావడం వెనుక కచ్చితంగా యాజమాన్యం తన బాధ్యతను గిరి గీసుకుంటున్నదన్నది స్పష్టం. ఒక ఉద్యోగిని నియమించుకున్న తర్వాత జీవితకాలం మరే ఉపాధి చేపట్టకుండా సంకెళ్లు విధించి తమ సంస్థకు మాత్రమే ఉపయోగించుకున్న ఈ యాజమాన్యం పదవీ విరమణ అనంతరం, వృద్ధాప్యంలో సరైన చేయూతను ఇవ్వాల్సిన బాధ్యతపై ఇలాంటి తిరకాసులు పెట్టడం గర్హనీయం. అందుచేతనే ఉద్యోగి కాంట్రిబ్యూషన్‌తో సంబంధం లేకుండా డిఫైన్డ్‌ పెన్షన్‌ పద్ధతి ఉండాలన్నది విశ్వవ్యాప్త అభిప్రాయం. ప్రకటిం చిన యుపిఎస్‌లో కాంట్రిబ్యూషన్స్‌ కూడా ప్రస్తావించడంతో ఈ స్కీములో ఆశాజనకంగా గోచరిస్తున్న యాభైశాతం అనే అంశం సందేహాత్మకమౌతుంది.
ఓపిఎస్‌తో సరితూగని యుపిఎస్‌
యుపిఎస్‌లో డిఫైన్డ్‌ యాభై శాతం పూర్తి పెన్షన్‌ కోసం 25 ఏండ్ల కనీస సర్వీస్‌ చేసి ఉండాలి. పెన్షన్‌ కోసం కనీసం పదేండ్ల సర్వీస్‌ అయినా ఉండాలి. 10నుండి 25 సం.ల మధ్య సర్వీస్‌ చేసిన వారికి ప్రపోర్షనేట్‌గా పెన్షన్‌ వర్తిస్తుంది. సూపర్‌ యాన్యుయేషన్‌కు ముందు 12 నెలల్లో తీసుకున్న సగటు ప్రాథమిక వేతనంలో యాభై శాతం పెన్షన్‌గా ఇస్తారు. పెన్షనర్‌ మరణానికి ముందు చివరిగా తీసుకున్న పెన్షన్‌లో 60శాతం పెన్షన్‌ కచ్చితంగా కుటుంబ పెన్షన్‌గా ఇస్తారు. కనీసం పదేండ్ల సర్వీసు తర్వాత సూపర్‌ యాన్యుయేషన్‌పై నెలకు కనీస పెన్షన్‌ రూ.10వేలు హామీ ఇవ్వబడుతుంది. హామీ ఇవ్వబడిన పెన్షన్‌పై, కుటుంబ పెన్షన్‌పై, హామీ ఇవ్వబడిన కనీస పెన్షన్‌పై సర్వీస్‌లో ఉన్నఉద్యోగులు లాగే పారిశ్రామిక కార్మికులకు ఆల్‌ఇండియా కన్స్యూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ (ఎఐసిపిఐ) ఆధారంగా డియర్‌నెస్‌ అలవెన్స్‌ కూడా వర్తిస్తుంది. కనీస పెన్షన్‌ యాభైశాతం పెన్షన్‌గా ప్రకటించి దానిపై కరువు భత్యాన్ని కూడా ఇవ్వాలనే ప్రతిపాదన ఆహ్వానించదగినదే. కానీ ఫుల్‌ పెన్షన్‌ పొందడానికి విధించిన 25 సంవత్సరాల సర్వీస్‌ అర్హత గతంలో ఇది ఇరవైయేండ్లుగా వుండేది. గ్రాట్యూటీకి అదనంగా చెల్లించ ప్రతిపాధించిన (25 ఏండ్ల సర్వీసుంటే ఇది చివరి ఐదు నెలల జీతానికి సమానం, పదేండ్ల సర్వీసుంటే రెండు నెలల జీతానికి సమానం) దాని ద్వారా ఓపిఎస్‌లో వచ్చే కమ్యుటేషన్‌కి, ఎన్పీఎస్‌లో వచ్చే అరవైశాతం విత్‌డ్రాయల్‌కి చరమగీతం పాడినట్లయింది. పదేండ్ల సర్వీస్‌ ఉంటే కనీసం పదివేల రూపాయల కనీస పెన్షన్‌ యుపిఎస్‌లో ఉన్నది. అయితే ఓపిఎస్‌లో కనీస పెన్షన్‌ తొమ్మిదివేలే ఉన్నప్పటికీ కనీసంగా పద్నాలుగు వేలకు పైగా డిఎతో వస్తుంది. పదేండ్ల కన్న తక్కువ సర్వీసుంటే యుపిఎస్‌లో ఎలాంటి చెల్లింపు ఉండదు. పెన్షనరు మరణానంతరం అరవై శాతం ఫ్యామిలీ పెన్షన్‌ కూడా ప్రకటించబడింది. ఓపిఎస్‌లో అమల్లో వున్న వందశాతంపై (ఫుల్‌ పెన్షన్‌)పై 30 శాతం కూడా దీనికి సమానమే! అయితే కనీస ఫ్యామిలీ పెన్షన్‌ యుపిఎస్‌లో లేదు. కనీస పెన్షన్‌ పదవీ విరమణకే తప్ప ఫ్యామిలీ పెన్షన్‌కి కాదు. ఓపిఎస్‌లో పెన్షనరైనా ఫ్యామిలీ పెన్షనరైనా ఎనభైయేండ్లు దాటితే అదనపు పెన్షన్‌గా 20శాతం, 85 దాటితే 30శాతం, 90దాటితే 40శాతం, 95 దాటితే 50శాతం, 100 దాటితే వందశాతం చెల్లించే అవకాశమున్న అంశాన్ని యుపిఎస్‌ ప్రస్తావించలేదు. యుపిఎస్‌ ప్రతిపాదనలన్నీ ఎన్పీఎస్‌ కన్నా మెరుగైనవిగా ఉన్నట్టు కనిపిస్తున్నా సర్వామోదమైన ఓపిఎస్‌కు సరితూగేవి కావు. 31 జులై 2024న 99, 77, 165 ఎన్పీఎస్‌ సభ్యులతో రూ.10,53, 850 కోట్ల కలిగిన ఫండ్‌కు మరింత జోడించి ప్రయివేటు పెట్టుబడిదారులకు అప్పజెప్పడమే ఇది.
2003 పెన్షన్‌ అంశం..పూర్వాపరాలు
వృద్ధాప్య పెన్షన్ల పేర్ల మార్పుపై వున్న శ్రద్ధ దాని పునరుద్ధరణపై కేంద్రానికి లేదు. 2003లో కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీంగా నామకరణం చేసి, ఆ తర్వాత డిఫైన్డ్‌ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం- న్యూ పెన్షన్‌ స్కీం అంటూ చివరికి నేషనల్‌ పెన్షన్‌ సిస్టంగా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీం అంటున్నారు. ఈ ఎన్పీఎస్‌ను 2003లో అప్పటి వాజ్‌పేయి ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం ఒక ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ద్వారా రహస్యంగా తీసుకువచ్చి నిరసనలకు కూడా అవకాశమివ్వలేదు. ఓల్డ్‌ పెన్షన్‌ స్కీం (ఓపిఎస్‌) సివిల్‌ సర్వీసెస్‌ నిబంధనలు- 1972 అనుగుణంగా అమలు జరుగుతున్నాయి. 2004 నుండి అమల్లోకి తెచ్చిన ఎన్పీఎస్‌ కోసం పిఎఫ్‌ఆర్‌డిఎ బిల్లును 2013 సెప్టెంబర్‌ పార్లమెంటులో పాస్‌ చేయించారు. అప్పటివరకు జమైన మొత్తమంతా కేంద్ర ప్రభుత్వ ఖజానాలోనే ఉండేది. సివిల్‌ సర్వీసెస్‌ నిబంధనలకు కొన్ని సవరణలను 2021లో చేసినప్పటికీ పెన్షన్‌పై మాత్రం సవరణలు చేయలేదు. ఎన్పీఎస్‌పై నిరసనలు వెల్లువెత్తడంతో కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు మార్చుకోవచ్చని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఇన్నాళ్లూ ఎన్పీఎస్‌కు జమకాబడిన మొత్తాలను కేంద్రం తిరిగి ఇవ్వదని స్పష్టం చేసింది. అలాంటప్పుడు రాష్ట్రాలు ఎందుకు ముందుకొస్తాయి? అయితే పోరాటాలు మరింత పెరగడంతో ఫైనాన్స్‌ సెక్రెటరి టి.వి.సోమనాథన్‌ ఆధ్వర్యంలో గతంలోనే కమిటీ వేసింది. కానీ కమిటీ రిపోర్ట్‌ ఇంకా ఇవ్వలేదని ఈ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష పార్టీల ప్రశ్నలకు సమాధానంగా ప్రకటించింది. కాపిటల్‌గైన్స్‌ టాక్స్‌, లిటరల్‌ ఎంట్రీ ద్వారా సివిల్‌ సర్వెంట్‌లను నియమించాలనుకోవటం వంటి వాటిల్లో తీవ్ర వ్యతిరేకత రావటం, త్వరలో జరగనున్న జమ్మూకాశ్మీర్‌, హర్యానా రాష్ట్రాల ఎన్నికలు, ఆ తర్వాత మరికొన్ని రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా యుపిఎస్‌ను ప్రకటించారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.అంటే రాజకీయ ప్రయోజనాలు ప్రజల ఆర్థిక జీవన విధానాలను ప్రభావితం చేస్తున్నప్పుడు అది మంచి ప్రజాస్వామ్య లక్షణం అనిపించుకోదు.
ప్రావిడెంట్‌ ఫండ్‌ విధానానికి పాతర
ఎన్పీఎస్‌ అమలు జరుగుతున్నప్పటి నుండి ప్రావిడెంట్‌ ఫండ్‌ సౌకర్యాన్ని పూర్తిగా రద్దు చేశారు. ఇప్పుడు యుపిఎస్‌లో కూడా ప్రావిడెంట్‌ ఫండ్‌ గురించిన మాటెత్తలేదు. ఎన్పీఎస్‌కు ఉద్యోగి తన జీతం నుండి పదిశాతం కాంట్రిబ్యూట్‌ చేస్తే యజమాని 14శాతం కాంట్రిబ్యూట్‌ చేసి రెండింటిని ఫండ్‌ మేనేజర్లకు అప్పచెబుతున్నారు. ఈ ఫండ్‌ మేనేజర్లు నిబంధనల ప్రకారం స్టాక్‌ మార్కెట్‌లతో పాటు ఇతర ప్రదేశాల్లో పెట్టుబడులుగా పెట్టి జమగాబడిన మొత్తాన్ని ఉద్యోగి పదవి విరమణ సందర్భంగా అరవై శాతాన్ని పన్ను మినహాయించిన తర్వాత తీసుకునే అవకాశం ఉంది. మిగతా నలభై శాతం పెన్షన్‌ కోసమై వినియోగించాలి. ప్రకటించబడిన యుపిఎస్‌ కు కూడా పదిశాతం ఉద్యోగి కాంట్రిబ్యూట్‌ చేస్తారు. యాజమాన్యం 14శాతం నుండి అంచలంచెలుగా 18.5శాతానికి పెంచే అవకాశం ఉందని కూడా ప్రకటించ బడింది. అయితే ఇదంతా కూడా మళ్లీ ఫండ్‌ మేనేజర్ల దగ్గరికి వెళుతుందా లేదా యాజమాన్యమే అభివృద్ధి పరుస్తుందా అనేది స్పష్టత లేదు. డిఫైన్డ్‌(నిర్ధారిత) యాభైశాతం పెన్షన్‌ ఇవ్వాలనుకున్నప్పుడు కాంట్రిబ్యూషన్లు సరిపోకపోతే సదరు లోటును ఎవరు భర్తీ చేస్తారు? ఉదాహరణకు ఓపిఎస్‌లో ఉద్యోగుల జీతాల నుండి పదిశాతం కాంట్రిబ్యూషన్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతా చేరుతుంది.ఆ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఇంట్రెస్ట్‌తో కలిపి పదవి విరమణ సందర్భంగా చెల్లించబడుతుంది. కేంద్ర ప్రభుత్వము ఎలాంటి కాంట్రిబ్యూషన్లు చేయకుండా పెన్షన్‌ బాధ్యత ఏర్పడినప్పుడు ప్రభుత్వ నిధుల నుంచి వితరణ చేస్తుంది. అదే ప్రభుత్వరంగాలైతే ఉద్యోగులనుండి ఎంత మేరకైతే రికవరీ చేయబడిందో దాన్నంతా పిఎఫ్‌కి జమచేసి, యాజమాన్యం అంతే మొత్తాన్ని పెన్షన్‌ ఫండ్‌గా ప్రత్యేక అకౌంటు ద్వారా తమ లెక్కల్లో చూపిస్తుంది. అయితే పెన్షన్‌ ప్రాధాన్యత ఏర్పడినప్పుడు మాత్రం ఈ ఫండ్‌లో ఎంత ఉందన్న దానిపై సంబంధం లేకుండా డిఫైన్డ్‌ పెన్షన్‌ను ఉద్యోగికి చెల్లిస్తోంది. ప్రావిడెంట్‌ ఫండ్‌ షరామామూలే. ప్రకటించిన యుపిఎస్‌లో ఇలాంటి వెసులుబాటు కనపడలేదు. ప్రకటించిన యుపిఎస్‌లో మరో ప్రమాదకరంగా కనిపిస్తున్నది. అది ఏంటంటే ఉద్యోగి, యాజమాని కలిసి చేసిన కాంట్రిబ్యూషన్లు దీర్ఘకాలం కొనసాగినప్పుడు చివరి వేతనంలోని యాభైశాతం కన్నా ఎక్కువ మొత్తం పెన్షన్‌ స్థిరపడే అవకాశం కూడా ఉన్నది. ఈ లోపబూయిష్టత ఉన్నది కాబట్టే వద్దనుకునేవాళ్లు ఎన్పీఎస్‌లో కొనసాగవచ్చు అనే ప్రకటన కూడా చేయబడింది. వెరసి, ఓపిఎస్‌- ఉద్యోగి కాంట్రిబ్యూషన్లను ప్రావిడెంట్‌ ఫండ్‌ రూపంలో వెనక్కి ఇస్తూ ఏర్పడే డిఫైన్డ్‌ పెన్షన్‌. యుపిఎస్‌- ఉద్యోగి, యాజమాన్యం కలిసి చేసిన కాంట్రిబ్యూషన్ల వివరాలను ప్రకటించకుండా ఏర్పడే డిఫైన్డ్‌ బట్‌ డిఫెక్టీవ్‌ పెన్షన్‌లా గోచరిస్తున్నది.
సాధారణంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు మొదటగా అమలు జరపడం ఆనవాయితీయే. అయితే కేంద్ర ప్రభుత్వానికి అనుబంధంగా, ప్రభుత్వ రంగాలుగా, కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో స్వతంత్ర సంస్థలుగా, రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేస్తున్న వివిధ డిపార్ట్మెంట్‌లకు ఈ నిబంధనలు వర్తించడానికి ఆయా రంగాలవాళ్లు అనేక పోరాటాలు చేయాల్సి వస్తున్నది. అందుచేత కేంద్రం ఈ తప్పిదాన్ని పునరావృతం చేయరాదు. అయితే యుపిఎస్‌ ఎన్పీఎస్‌ కన్న మెరుగైనదిగానే కనిపిస్తున్నప్పటికీ దాన్ని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు సంఘాల సలహాలు తప్పనిసరి. అయితే అంతిమ లక్ష్యం ఓపిఎస్‌ కాబట్టి మరిన్ని పోరాటాలకు కార్మికవర్గం సిద్ధపడాల్సిందే.

– జి.తిరుపతయ్య, 9951300016