ఎన్‌డీ నాయకత్వంపై కుట్రకేసులు

– రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్‌ వెంకటేశ్వరరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సీపీఐ(ఎంఎల్‌)ఎన్‌డీ రాష్ట్ర నాయకత్వంపై రాష్ట్ర ప్రభుత్వం కుట్ర కేసులు మోపుతున్నదనీ వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్‌ వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర నాయకులు కె. గోవర్ధన్‌, గౌని ఐలయ్య, ఎం శ్రీనివాస్‌, జి అనురాధతో కలిసి విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 14న ఎన్‌డీ రాష్ట్ర కార్యదర్శి అశోక్‌, రాష్ట్ర నాయకులు గోపన్నలతో పాటు ఎస్‌కే మదార్‌, కె సురేశ్‌లను ఖమ్మం పరిసర ప్రాంతాల్లో అదుపులో తీసుకున్నారని తెలిపారు. వారిని 48గంటల్లో కోర్టులో హాజరుపర్చకుండా 16న అరెస్టు చేసినట్టు తప్పుగా చూపించారని విమర్శించారు. వారితో పాటు 24 మందిపై ప్రభుత్వాన్ని కూలదోయటానికి ఆయుధాలు, డబ్బులు సమకూర్చుకుంటున్నారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. వారితో పాటు మరికొందరిని అరెస్టు చేశారని వారందరిపైనా పెట్టిన కేసులను ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజాపాలన అని చెప్పుకునే సర్కారులో నిర్భందమేంటని ప్రశ్నించారు.