దక్షిణ కొరియాలో కుట్ర : వైఫల్యమా? విబేధాలా!

Conspiracy in South Korea: Failure? Vybedhala!అత్యవసర పరిస్థితి పేరుతో సైనిక పాలనకు తెరతీసి కేవలం ఆరుగంటల వ్యవధిలో అనివార్య పరిస్థితుల్లో ఎత్తివేసిన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ దేశం విడిచిపోకుండా అక్కడి అవినీతి నిరోధకశాఖ ప్రధాన కార్యాలయం ఆంక్షలు విధించింది. దీంతో అక్కడ సంక్షోభం సమసిపోలేదన్నది స్పష్టం. 1987 తరువాత తొలిసారిగా దక్షిణ కొరియాలో మిలిటరీ పాలన రుద్దేందుకు చూశారు. 2024 డిసెంబరు మూడోతేదీ మంగళవారం రాత్రి సైనిక పాలన విధించి బుధవారం తెల్లవారుజామున రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అత్యవసర పరిస్థితి ప్రకటన, మిలిటరీకి అధికారాలు అప్పగింత, పార్లమెంటు వ్యతిరేక తీర్మానం, ఉపసంహరణ నాటకీయంగా జరిగాయి. అనేక అనుమానాలకు తావిచ్చే ఈ పరిణామం ఎందుకు, ఎలా జరిగింది? తెరవెనుక కథ ఏమిటన్నది తెలియాల్సి ఉంది. కారణాలేమైనా తాత్కాలికంగానైనా జనం ఊపిరి పీల్చుకున్నారు. అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ మీద ప్రతిపక్షాలు పెట్టిన అభిశంసన తీర్మానం వీగిపోయింది. మరోసారి పెట్టేందుకు చూస్తున్నారు. తప్పు చేసినట్లు యూన్‌ ప్రకటించాడు. తనపై ఏదో ఒక నిర్ణయం తీసుకొనే బాధ్యతను పార్టీకి అప్పగిస్తున్నట్లు జాతీయ టీవీలో ప్రసంగిస్తూ చెప్పాడు. అయితే అధ్యక్షుడు ఏ కార్యకలాపాలు నిర్వహించకూడదని నిర్ణయించినట్లు ప్రధాని హాన్‌ డక్‌ సూ, అధికార పీపుల్స్‌ పవర్‌ పార్టీ (పిపిపి) నేత హాన్‌ డాంగ్‌ హూ ప్రకటించారు. మరోవైపు యూన్‌ మీద విచారణ జరుపుతున్నట్లు ప్రత్యేక దర్యాప్తు అధికారి ప్రకటించాడు. అధ్యక్షుడు రాజీనామా చేస్తే లేదా నేరాలకు పాల్పడినపుడు అరెస్టయితే తప్ప విధులు నిర్వహించటానికి ప్రధానికి అవ కాశం లేదు. మిలిటరీ కమాండర్‌ ఎవరనే ప్రశ్న కూడా తలెత్తింది. సాంకేతికంగా అధ్యక్షుడు ఉన్నా అధికారాలు లేనట్లు ప్రకటించిన తరువాత హోంమంత్రి రాజీనామాను ఆమోదించిన తీరుచూస్తే తెరవెనుక ఏదో జరుగుతోందన్న భావన కలుగుతోంది.అధ్యక్షుడికి అధికారాలు లేకుండా చేసి పదవి నుంచి తొలగించకుండా కొనసాగించటం దేశంలో జరిగిన రెండో కుట్రగా ప్రతిపక్షాలు వర్ణించాయి.
తాత్కాలిక రక్షణ మంత్రి, సైనిక దళాల జాయింట్‌ చీఫ్‌ కమాండర్‌ ఒక ప్రకటన చేస్తూ యూన్‌ మరోసారి అత్యవసర పరిస్థితి ప్రకటిస్తే ఆమోదించేది లేదని చెప్పటం విశేషం. అత్యవసర పరిస్థితి ఎత్తివేత తరువాత రక్షణ మంత్రి రాజీనామా చేశాడు, అతనిపై దేశద్రోహనేరం మోపి అరెస్టు చేశారు. ప్రత్యేక దళాల, రాజధాని రక్షణ కమాండర్లు అనేక మందిని విధుల నుంచి తప్పించారు. దక్షిణ కొరియాలో మిలిటరీ నియంత పాలన అధికారికంగా అంతమైనప్పటికీ పాలనలో మిలిటరీ ప్రమేయం కొనసాగుతూనే ఉంది.1961లో జరిగిన తొలి మిలిటరీ తిరుగుబాటు తరువాత 1987నుంచి పౌరపాలన ఉన్నప్పటికీ పౌర భద్రతా వ్యవహారాలన్నీ మిలిటరీ మాజీ నేతలే ఎక్కువగా చూస్తున్నారు. ఇంతవరకు రక్షణ మంత్రిగా ఒక్కరంటే ఒక్కరు కూడా మిలిటరీయేతరులు లేరు. అనేక ముఖ్య బాధ్యతల్లో ఉద్యోగవిరమణ చేసిన మిలిటరీ అధికారులే ఉంటున్నారు. అందువలన పౌర నేతలు తమ రాజకీయ అవసరాల కోసం మిలిటరీ నేతల మీదనే ఆధార పడుతున్నారు. మిలిటరీ అధికారుల తీరుతెన్నులు చూసినపుడు వారు రాజకీయాల్లోని మితవాద శక్తులతోనే బలమైన సంబంధాలు కలిగి ఉండటం ఆందోళన కలిగించే అంశం.ప్రజాస్వామ్యం కోసం జరిగిన ఆందోళన, ఉద్యమాలను అణచివేసిన చరిత్ర వారిది. తమతో చేతులు కలపని లేదా విబేధించే వారిని కమ్యూనిస్టులతో సంబంధాలు ఉన్నాయనో దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారనో ఆరోపించి అణచివేయటం పరిపాటిగా మారింది. డిసెంబరు మొదటి వారంలో అత్యవసర పరిస్థితి ప్రకటించి విధిలేక వెనక్కు తీసుకున్న యాన్‌ కూడా అవే చిలుక పలుకులు వల్లించాడు. అక్కడ మిలి టరీ పాలన ముప్పు మెడ మీద కత్తిలా వేలాడుతూనే ఉంది. 2017లో దొడ్డిదారిన మిలిటరీ పాలన రుద్దేందుకు చూశారు.అవినీతికి పాల్పడినందుకు అధ్యక్షురాలు పార్క్‌ యున్‌ హై మీద పెట్టిన అభిశంసన తీర్మానం నెగ్గింది. దాంతో ఆమెను తిరిగి నియమించకూడదంటూ ఆందోళనకు సిద్దపడిన వారిని, మీడియాను అణచేందుకు వందలాది మిలిటరీ వాహనాలు, ఆరువేల మంది సైనికులను సిద్దం చేసి మిలిటరీ పాలన ప్రకటించేందుకు దాదాపు ఏర్పాట్లు చేశారు.
తాజా పరిణామాలకు వస్తే అత్యవసర పరిస్థితి విధింపును వ్యతిరేకిస్తూ పద్దెనిమిది మంది అధికార పక్ష సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయటంతో నెగ్గింది. అయితే అభిశంసన తీర్మానం సమయానికి వారు వెనక్కు తగ్గటంతో వీగిపోయింది. అయినప్పటికీ యూన్‌ రాజీనామా, అతగాడి అరెస్టు, అధికార పార్టీని రద్దు చేయాల్సిందేనంటూ ఆదివారం నాడు సియోల్లో పార్లమెంటు ముందు వేలాది మంది జనం ప్రదర్శన చేశారు. అధ్యక్షుడిని తప్పించకుండా ప్రధానికి అధికారాన్ని కట్టబెట్టటం రాజ్యాంగ విరుద్దమని పార్లమెంటు స్పీకర్‌ ఊ వన్‌ షిక్‌ ప్రకటించాడు. తక్షణమే యూన్‌ అధికారాన్ని సస్పెండ్‌ చేసేందుకు అవకాశాలను వెతికేందుకు ప్రతిపక్ష పార్టీలతో సమావేశం జరపనున్నట్లు పేర్కొన్నాడు. స్వల్ప మెజారిటీతో అధ్యక్ష పదవికి ఎన్నికైన యూన్‌ గత రెండున్నరేండ్లుగా ప్రతిపక్షాలు, మీడియా, కార్మికవర్గాన్ని అణచివేసేందుకు చూశాడు. కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించాడు. 2023 ఆగస్టులో లిబరేషన్‌ డే ప్రసంగంలో కమ్యూనిస్టు నియంతృత్వశక్తులు ప్రజాస్వామ్యం, మానవహక్కుల కార్యకర్తలు లేదా పురోగామి శక్తుల ముసుగులో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అనైతిక ఎత్తుగడలను అనుసరిస్తున్నారని ఆరోపించాడు. నియంతల పాలనలో ప్రతివారూ ఇలాంటి చిలుక పలుకులే వల్లించారు. సైనిక పాలన విధించేందుకు అవసరమైన పద్ధతుల్లో యూన్‌ ఏదో చేయబోతున్నట్లు ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ ఎంపీ కిమ్‌ మిన్‌ ఒక ప్రకటనలో హెచ్చరించాడు. తన స్కూలు సహాధ్యాయులు, అనుచరులను పెద్ద సంఖ్యలో కీలకమైన మిలిటరీ, ఇతర భద్రతా అధికార పదవుల్లో నియమించాడని పేర్కొన్నాడు. తాజా పరిణామాల తరువాత కిమ్‌ చెప్పింది వాస్తవమే అని పచ్చి మితవాద పత్రిక చోసన్‌ ఇబో వ్యాఖ్యానించింది. యూన్‌ భార్య కిమ్‌ ఇవోన్‌ హి, అధ్యాత్మిక సలహాదారు మైయుంగ్‌, ఇతర అనుచరగణం అనేక అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారు. అధికార పార్టీలో తమ అనుచరులకు పెద్దపీట వేశారు.
కార్పొరేట్లకు అనుకూలంగా కార్మిక వ్యతిరేకమైన చర్యలను యూన్‌ ప్రతిపాదించాడు. వారానికి 52గంటలకు బదులు 120 గంటలు పని చేయాలని, ఏడు రోజులూ 17 గంటల చొప్పున విధులు నిర్వహించాలని పిలుపునిచ్చాడు. మార్చినెలలో కార్మిక శాఖ 69 గంటల పని వారాన్ని ప్రతిపాదించగా కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. సైనిక పాలన విధించిన వెంటనే సైనిక జనరల్‌ ఆన్‌ సూ అన్ని రాజకీయ కార్యకలాపాలు, కార్మికుల సమ్మెలను నిషేధించాడు, పత్రికల మీద సెన్సార్‌షిప్‌ ప్రకటించాడు. ఎవరినైనా వారంటు లేకుండా అరెస్టు చేసే అధికారమిచ్చాడు. సమ్మెచేస్తున్న వైద్యులు విధుల్లో చేరాలని ఆదేశించాడు. కార్మిక సంఘాలలో లేని కార్మికుల రక్షణ కోసమంటూ ప్రతిపాదించిన చర్యలకు ప్రతిపక్షం మద్దతు ఇవ్వాలని ఈ ఏడాది మేనెలలో యూన్‌ కోరాడు. అలాంటి కార్మికులు పరస్పరం సహాయం చేసుకొనే విధంగా అసోసియేషన్లను ప్రోత్సహిస్తామని చెప్పాడు. ఇది కార్మికులను సంఘాలకు దూరం చేసే, విచ్చిన్నం చేసే ఎత్తుగడతప్ప మరొకటి కాదు. పార్లమెంటులో ప్రతిపక్షాలు మెజారిటీగా ఉన్నందున ఇలాంటి ప్రతిపాదనలు ఆమోదం పొందే అవకాశం లేదు. సంఘటిత కార్మిక సంఘాలంటే హింసాత్మక నేరాలకు పాల్పడే సంఘటిత శక్తులని యూన్‌ ఆరోపించాడు. నిర్మాణ రంగంలో తమ కార్మికులను మాత్రమే వినియోగించాలని కంపెనీల మీద సంఘాలు ఒత్తిడి చేస్తున్నాయని నిందించాడు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు కార్మిక సంఘాలను బూచిగా చూపి నిందిస్తే జనం హర్షిస్తారని భావించిన యూన్‌ ఇతర చర్యలతో అదే ప్రజల్లో పలుకుబడి కోల్పోయాడు. 2022లో జరిగిన ఎన్నికల్లో కేవలం 0.73శాతం ఓట్ల మెజారిటీతో మాత్రమే యూన్‌ ఎన్నికయ్యాడు. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో పార్లమెంటులోని 300 స్థానాలకు గాను యూన్‌ నాయకత్వంలోని పీపుల్స్‌ పవర్‌ పార్టీ 108 స్థానాలను మాత్రమే తెచ్చు కోగా ప్రతిపక్షాలకు 192 వచ్చాయి. అందువలన తన అజెండాకు పార్లమెంటు ఆమోదం తెలిపే అవకాశం లేకపోవటంతో దాన్ని పక్కన పెట్టేందుకు కుంటి సాకులతో అత్యవసర పరిస్థితి లేదా మిలిటరీ పాలన రుద్దేందుకు ప్రయత్నించాడు. ఒక వైపు మిలిటరీ పాలన ప్రకటనకు క్షమించాలని అంటూనే తన చర్యను సమర్ధించుకున్నాడు. పార్లమెంటులో మెజారిటీగా ఉన్న పార్టీలు అసాధారణ రీతిలో తన యంత్రాంగాన్ని అభిశంసించేందుకు పూనుకొని బడ్జెట్‌తో సహా ప్రభుత్వ కార్య కలాపాలను అడ్డుకొనేందుకు పూనుకున్నట్లు ఆరోపించాడు.
ఇప్పుడు దక్షిణ కొరియాలో ఏం జరగబోతోంది అన్న ఆసక్తి తలెత్తింది. యూన్‌ రాజీనామా చేయటం, అధ్యక్ష ఎన్నికలను ప్రకటించటం ఒకటి. అయితే గత ఎన్నికల్లోనే స్వల్ప మెజారిటీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘోరపరాభవం పాలైన అధికార పక్షం ఇంత జరిగాక ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతుందా ? యూన్‌ మీద విచారణ తతంగం జరిపి తిరిగి ఓటర్లలో విశ్వాసం ఉంది అనుకుంటే అప్పుడు ఎన్నికలకు వెళ్లవచ్చు. దాంట్లో భాగంగానే దేశ పౌరులకు టీవీలో క్షమా పణ కూడా చెప్పించారు. అధికార విధులేవీ నిర్వర్తించకూడదని, ఒక క్రమ పద్ధ్దతిలో తప్పుకుంటాడని ఆదివారం నాడు పార్టీ ప్రకటించినప్పటికీ మరోసారి సైనికపాలన విధించేందుకు అవసరమైన అధికారాలన్నీ అతగాడి వద్ద ఉన్నాయి. శనివారం నాడు పార్లమెంటు వద్ద యూన్‌కు వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనలో పదిలక్షల మంది పాల్గొన్నట్లు నిర్వాహకులు ప్రకటించగా పోలీసులు లక్షా 49వేల మంది అని చెప్పారు. అనేక అంశాలతో పాటు ఆర్థిక దిగజారుడు అక్కడి కార్పొ రేట్లను ఆందోళనకు గురిచేస్తున్నది.వృద్ధి రేటు 2010లో 6.8శాతం ఉండగా గతేడాది 1.4శాతానికి దిగజారింది. ఈ ఏడాది 2.2శాతంగా ఉండవచ్చని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది.అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదికల ప్రకారం 2022లో నిజవేతనాలు 0.2శాతం, 2023లో 1.3శాతం పడిపోగా ఈ ఏడాది 0.5శాతం ఉండవచ్చని అంచనా. ఈ కారణంగానే అనేక పరిశ్రమల, సంస్థల కార్మికులు ఇటీవలి కాలంలో ఆందోళనలు చేపట్టారు. దాని అణచివేత ప్రయత్నమే సైనిక పాలన అని చెప్పవచ్చు. వచ్చే రోజుల్లో ఏ ప్రభుత్వం వచ్చినా లేదా సైనిక తిరుగుబాటు జరిగినా కార్మికవర్గానికి పోరుబాట తప్ప మరొక మార్గం లేదు.
ఎం కోటేశ్వరరావు
8331013288