రాష్ట్ర విభజన చట్టంలోని అంశాల అమలులో కుట్ర

– రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ – బంజారాహిల్స్‌
రాష్ట్ర విభజన చట్టంలోని అంశాల అమలులో కుట్ర దాగి ఉందని పలువురు వక్తలు అన్నారు. ఉద్యమ ఆకాంక్ష వేదిక ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సీనియర్‌ జర్నలిస్ట్‌ పాశం యాదగిరి, ఉద్యమ నాయకులు విఠల్‌, గాదె ఇన్నయ్య అధ్యక్షతన జరిగిన ‘కుట్ర-ఆధిపత్యం’పై రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు నేడు విభజన ఒప్పంద చట్టం అమలుపై సమీక్ష చేస్తున్నారని అన్నారు. ఇది దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉన్నదన్నారు. 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని గడువు ముగిసిన తరువాత తెలంగాణపై ఆధిపత్యం కోసం కొత్త నాటకానికి రంగస్థల వేదికగా విభజన చట్టాన్ని సాకుగా ఆంధ్ర దోపిడీదారులు వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. విభజన చట్టం హామీలు 10 సంవత్సరాలు ఎందుకు పూర్తి కాలేదు? దీనికి కారకులు ఎవరు? ఇప్పటి వరకు జరిగిన ప్రయత్నాల గురించి ఎవరూ చెప్పడం లేదన్నారు. రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన పాలకులు ఇప్పుడు తెలంగాణపై ఆధిపత్యం చలాయించడానికి, సంపదను దోచుకోవడానికి, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి కుట్రలు చేస్తున్నారని అన్నారు. ‘తెలంగాణ తల్లిని అంగడి సరుకు చేసి అవమానపరచడాన్ని చూస్తూ ఊరుకుందామా? త్యాగాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో మరోసారి బానిసలై ఉందామా? సకల సంపద కలిగిన తెలంగాణను సర్వనాశనం చేస్తుంటే మన బాధ్యతను నేమరువేసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది’ అన్నారు. ఆ కర్తవ్య నిర్వహణలో భాగమే ఈ సమావేశమని చెప్పారు.