– ప్రొఫెసర్ నందినీ సుందర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అటవీ సంపదపై కార్పొరేట్లు కన్నేశారనీ, ఆ సంపదను వారికి కట్టబెట్టేందుకు ప్రభుత్వాలు అడవి బిడ్డలపై యుద్ధం చేస్తున్నారని ఆదివాసీ చట్టాలు – సాయుధీకరణ అంశంపై ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ నందినీ సుందర్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పౌరహక్కుల సంఘం 50 వసంతాల ముగింపు సంభలో ఆమె మాట్లాడారు. ఈశాన్యాన ప్రకృతి అందాలకు నెలవైన మణిపూర్ ఇటీవల భగ్గుమనటం కలకలం రేపిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివాసీ ప్రాంతాలపై పోలీసు ప్రహరా కొనసాగుతుందన్నారు.
సుప్రీం కోర్టు తీర్పులను కూడా లెక్క చేయకుండా రూపం మార్చి గిరిజనులపై ప్రభుత్వం దాడులు కొనసాగిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పోరేటీకరణ – కార్మిక హక్కుల విధ్వంసం అనే అంశంపై ఐఎఫ్‌టీయూ జాతీయ ఉపాధ్యక్షులు పి. ప్రసాద్ మాట్లాడుతూ వందల ఏండ్లుగా ఆధ్యాత్మికంగా ప్రజల గుండెల్లో కొలువుదీరిన రాముడు, రాజకీయానికి ప్రధాన ఆయుధంగా మారాడని చెప్పారు. ఆ రామున్ని కొలిచే కార్మికులను రాజకీయ రాముడిని కూడా పూజించే కార్మికులుగా మార్చేందుకు జరుగుతున్న ప్రక్రియ దేశానికి చాలా ప్రమా దకరమని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని చైతన్యయుతంగా కార్మిక వర్గం అడ్డుకోవాల్సిన అవసరముందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన కార్మిక చట్టాల రద్దు కారణంగా చికాగోలో సాధించుకున్న 8 గంటల పని విధానం.. 12 గంటల పనిదినంగా మారుతోందని చెప్పారు. ఇది కార్మికుల సామాజిక జీవనంపై దాడిగా చూడాలన్నారు. కార్మిక పోరాటాలను ఆర్థిక కోణంలో కాకుండా, సమగ్ర హక్కుల సాధనగా ఆలోచించాలని సూచించారు. అయోధ్య సమస్య ప్రజల అంశంగా మారడం బాధాకరమన్నారు. సదస్సులో పౌర హక్కుల సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణ రావు, కన్నెగంటి రవి, శ్రీమన్నారాయణ, ఆంజనేయులు, మాధురి తదితరులు మాట్లాడారు.