బ్యాంకులను నిర్వీర్యం చేసే కుట్ర

బ్యాంకులను నిర్వీర్యం చేసే కుట్ర– హోల్‌సేల్‌ అమ్మకానికి ప్రభుత్వరంగ సంస్థలు సేల్స్‌మెన్‌గా నిర్మలాసీతారామన్‌ : అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు ఎన్‌.శంకర్‌
నవతెలంగాణ- అంబర్‌పేట
ప్రభుత్వరంగ బ్యాంకులను నిర్వీర్యం చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఏఐబీఈఏ జాతీయ ఉపాధ్యక్షులు, అఖిల భారత యూనియన్‌ బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్‌.శంకర్‌ అన్నారు. హైదరాబాద్‌ కాచిగూడలోని మ్యడం అంజయ్య హాల్‌లో శనివారం యూనియన్‌ బ్యాంకు అవార్డు ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రథమ సంయుక్త ప్రాంతీయ ద్వివార్షిక మహాసభ ఏఐయుబిఈఏ కార్యనిర్వాహక అధ్యక్షులు టి.రవీంద్రనాథ్‌ అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభను ఎన్‌.శంకర్‌ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ తిరోగమన విధానాలతో భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ధ్వంసం అవుతోందన్నారు. లాభాల్లో ఉన్న బ్యాంకులతోపాటు దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వరంగ సంస్థలను మోడీ ప్రభుత్వం హోల్‌సేల్‌గా అమ్మకానికి పెట్టిందని, వీటికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సేల్స్‌మెన్‌గా పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ”ఒక ప్రభుత్వ రంగ సంస్థ కొంటె మరొకటి ఉచితంగా ఇస్తాం” అని ఆఫర్‌ ప్రకటించినా ఆశ్చర్యపోనక్కరలేదని అన్నారు. వంద శాతం ప్రజా పెట్టుబడితో లాభాల్లో నడుస్తున్న ఎల్‌ఐసీని ప్రయివేటీకరణ చేయడం దారుణమన్నారు.
ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ను బలహీనపరచడానికి కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల విలీన పక్రియ చేపట్టిందన్నారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో ఐదు అసోసియేట్‌ బ్యాంకుల విలీనం తర్వాత, దాదాపు 1,000 శాఖలు మూతపడ్డాయని, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో దేనా బ్యాంక్‌, విజయా బ్యాంక్‌ విలీనంతో 800 శాఖలు మూతపడ్డాయని వివరించారు. ప్రత్యేకించి గ్రామీణ భారతదేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ అందుబాటులో లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేటీకరణ వల్ల కార్మికుల ఉద్యోగ భద్రత తుడిచిపెట్టుకుపోగా, నిరుద్యోగ విపత్తు పెరిగిపోయిందన్నారు.
కె.భాస్కర్‌రావు మాట్లాడుతూ.. ఆధునిక బ్యాంకింగ్‌ వ్యవస్థ అత్యంత డైనమిక్‌, సవాలుతో కూడుకున్నదన్నారు. బ్యాంకింగ్‌ సిబ్బంది సాంకేతికత, నైపుణ్యం, జ్ఞానాన్ని నిరంతరం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ మహాసభలో యూనియన్‌ బ్యాంకు అఫ్‌ ఇండియా చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌, హైదరాబాద్‌ జోన్‌ మేనేజర్‌ కె.భాస్కర్‌రావు, యూబీఐ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, హైదరాబాద్‌ జోన్‌ ఏ.రవి కుమార్‌, యూనియన్‌ బ్యాంకు అవార్డు ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమద్‌ ఖాన్‌, యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా హైదరాబాద్‌ రీజినల్‌ హెడ్స్‌ ఎన్‌. శ్రీనివాస్‌ రావు, యూనియన్‌ బ్యాంకు అవార్డు ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి కె.రాజగోపాల్‌, ఉప ప్రధాన కార్యదర్శి కె.రాజేందర్‌, ఉపాధ్యక్షులు సి.మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.