వెనెజులా ప్రభుత్వ కూల్చివేత కుట్ర!

Conspiracy to overthrow the government of Venezuela!గత నెలలో జరిగిన వెనెజులా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఐక్యరాజ్యసమితి ఎన్నికల నిపుణుల పేరుతో ఇచ్చిన నివేదికను మదురో సర్కార్‌ తిరస్కరించింది. అమెరికా కనుసన్నల్లో తమ ప్రజాస్వామిక వ్యవస్థను దెబ్బతీసేందుకు చేసిన కుట్రగా విదేశాంగశాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది. తమ ఎన్నికల కమిషన్‌తో కుదుర్చుకున్న ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించినట్లు విమర్శించింది. ఐరాస బృందం పర్యటన సమయంలో నివేదిక ఎలా తయారు చేయాలి, దానిలో ఏం రాయాలో కూడా అమెరికా అధికారులతో నిరంతరం సంప్రదించినట్లు స్పష్టం చేసింది. మదురో మీద పోటీ చేసి గెలిచినట్లు ప్రకటించుకున్న ఎడ్మండ్‌ గోన్‌సాలెజ్‌ను దేశ అధయక్షుడిగా గుర్తించినట్లు అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి అను గుణంగానే గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఉన్నాయి. అమెరికా ఆదీనంలో నడిచే దేశాలు అది పాడిన పాటనే పాడుతున్నాయి.పాడిందే పాడరా అన్నట్టుగా వెనెజులాలో మానవ హక్కులు లేవన్నది వాటిలో ఒకటి.ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ ఎన్నికల కమిషన్‌ ముందు హాజరై తమ ప్రకటనలను నమోదు చేయ టంతో పాటు తమ దగ్గర ఉన్న రికార్డుల్ని అందజేశారు.కేవలం ఒక్క గోన్‌సాలెజ్‌ మాత్రమే సుప్రీంకోర్టు ఆదేశా లను ఖాతరు చేయ కుండా తన ఆరోపణ లను రుజువు చేసేందుకు అవసరమైన సాక్ష్యాలను సమర్పించటంలో విఫలమయ్యాడు.
మంగళవారం నాడు ప్రారంభమైన వెనెజులా పార్లమెంటు సమావేశాల్లో ఫాసిస్టు వ్యతిరేక జాతీయ కమిషన్‌ ఏర్పాటుతో పాటు సైబర్‌ ఫాసిజం గురించి కూడా చర్చించనుంది. సామాజిక సంస్థల నెట్‌వర్క్‌ పేరుతో ఉన్నవారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కుట్రలు పన్నుతున్నారు. వీటి నియంత్రణ గురించి కూడా పార్లమెంటు చట్టాలను రూపొందించేందుకు తలపెట్టింది. ఈ నెలాఖరులో ప్రభుత్వ కూల్చివేత కుట్రలో భాగంగా హింసా త్మక ఘటనలను సృష్టిం చేందుకు విదేశీ సంస్థలతో కలసి దేశం లోని మిత వాద శక్తులు కుట్ర పన్నినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దానిలో భాగంగా ఆ కుట్రలో భాగస్వాములైన వారిని పట్టుకునేందుకు దేశమంతటా గాలింపు చర్యలను చేపట్టింది. స్వచ్చంద సంస్థల ముసుగులో ఉన్నవారిని అదుపు చేసేందుకు కూడా పార్లమెంటులో చట్టసవరణకు సిద్ధమైంది. దేశంలో తలెత్తిన పరిస్థితి కారణంగా గతంలో పార్లమెంటు సమావేశాలకు ప్రకటించిన విరామాన్ని కూడా రద్దు చేసి అనేక చట్టాలను ఆమోదించేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దేశ ఎన్నికల సంఘం అధికారికంగా మదురో విజయాన్ని ఖరారు చేస్తూ ప్రకటించగా, ప్రతిపక్ష కూటమి తామే గెలిచినట్లు పోటీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దానికి అను గుణంగానే ఐరాస నిపుణుల పేరుతో మదురోకు వ్యతిరేకంగా నివేదికను తయారు చేయించారు. ఎన్నికలకు ముందే సర్వేల పేరుతో ప్రతిపక్ష అభ్యర్థి ముందున్నట్లు ప్రచారం చేయటం, తరువాత ఫలితాు భిన్నంగా రావడంతో అక్రమాలు జరిగినట్లు యాగీ చేయటం తాజా ఎన్నికలతో పాటు 2018లో కూడా జరిగింది. లాటిన్‌ అమెరికా దేశాలను చూసినపుడు మొత్తంగా దాదాపు అన్ని దేశాలలో మీడియా సంస్థలు వామపక్షాలను వ్యతిరేకించే కార్పొరేట్‌, మితవాద శక్తుల అదుపులో ఉన్నాయి.
జనం ఎక్కడికక్కడ జాగరూకులై ప్రభుత్వ వ్యతిరేకులు పన్నుతున్న కుట్రలను ఎప్పటికప్పుడు తెలియచేయాలని మదురో కోరాడు. ప్రభుత్వ వ్యతిరేక కుట్రలకు ఒక సాధనంగా ఉన్న ‘ఎక్స్‌’ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు, వాట్సాప్‌ సేవల నుంచి వైదొల గాలని దేశ పౌరులను కోరాడు. సైబర్‌ ఫాసిస్టు శక్తులు జూలై 28 నుంచి కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు 25 సంస్థల కార్యకలాపాలను దెబ్బతీసే దాడులు జరిపాయని, అనేక సేవలకు అంతరాయం కలిగిందని ప్రభుత్వం ప్రకటించింది.
అమెరికా విధించిన ఆర్థిక, రాజకీయ ఆంక్షల కారణంగా ఎగుమతి చేసేందుకు పెద్ద మొత్తంలో చమురు నిల్వలు ఉన్నప్పటికీ వెనెజులా వాటిని విక్రయించలేకపోతున్నది. దీంతో ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ కార్మికులను ఆదుకొనేందుకు సంక్షేమ చర్యలతో ముందుకు పోతున్నది. అన్ని విధాలుగా ప్రభుత్వం వైఫల్యం చెందిందనే అభిప్రాయాన్ని జనంలో కలిగించేందుకు అమెరికా చేస్తున్న కుట్రలను మదురో ఎప్పటికప్పుడు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు కూడా అన్ని అవాంతరాలను ఎదుర్కొంటారని భావిస్తున్నారు.